కాల్పుల ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. తాజాగా కాల్పుల మోతతో చికాగో నగరం ఉలిక్కిపడింది. ఇండియానా నైట్ క్లబ్ లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.
ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. అగ్నేయ చికాగోలోని గేరీ ప్రాంతంలో వేకువ జామున 2 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు వార్తలు వినిపించాయి. కాల్పులకు పాల్పడింది ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు విగతజీవులుగా కనిపించారు. వారిని ఆస్పత్రిగా తరలించగా వారు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
చికాగోలో వరుస కాల్పులు కలవరం రేపతున్నాయి. వారంతంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఐదుగురు మరణించగా దాదాపు 20 మంది వరకు గాయపడ్డారు.