సరిగ్గా నెల క్రితం కిలో 50 రూపాయలు ఉన్న చికెన్ ధర 300 దాటింది . కరోనా ప్రారంభంలో చికెన్ తినడానికి జనం భయపడ్డారు . దీంతో, ధరలు తగ్గిపోవడం, డిమాండ్ లేకపోవడంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు. గతంలో రాష్ట్రంలో ప్రతి నెలా 4 కోట్లకుపైగా కోడి పిల్లలను పెంచేవారు. ప్రస్తుతం 2 కోట్ల కోడి పిల్లలను మాత్రమే పెంచుతున్నారు. కోళ్ల పెంపకం సగానికి పడిపోవడం, ఎండల కారణంగా కోళ్లు బరువు తక్కువ తూగుతుండటం.. మరోవైపు చికెన్ పట్ల సామాన్యులు ఆసక్తి చూపుతుండటంతో.. మళ్లీ డిమాండ్ పెరిగింది. దీంతో ధర భారీగా పెరిగింది.చికెన్ ధర పెరిగినా.. పెంపకందారులకుఇప్పుడు వచ్చే లాభాలు కూడా తక్కువే. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిస్తే.. కోళ్ల పెంపకం పూర్వ స్థితికి చేరుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మాములు రోజులకంటే చికెన్ ఎక్కువగానే కొంటున్నారు .ఇక మటన్, చేప ధరలు సైతం సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి . కిలో మాంసం ధర 800 అమ్ముతున్నారు . మటన్ కొనలేని సామాన్యులు చికెన్ తినడానికి ఇష్టపడతారు . కానీ చికెన్ ధరలు కూడా భారీగా పెరగడంతో అది కూడా తినలేకపోతున్నారు . కేవలం కోడి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు .
చికెన్ ధరలు భారీగా పెరగడానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం కూడా ఓ కారణమంటున్నారు. మొత్తానికి సామాన్యుడు చికెన్ కొనలేని పరిస్థితి ఏర్పడింది . ధరలు తగ్గాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.