ఆ రండి బాబూ రండి.. కిలో చికెన్ జస్ట్ రూ.99 మాత్రమే.. ఈ ఆఫర్ కూడా రెండు రోజులే ఉంటుంది బాబూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి బాబూ. ఇలా బంపర్ ఆఫర్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది. అసలే కిలో చికెన్ రూ.200 నుండి రూ.250 ఉన్న కాలం. అలాంటిది జస్ట్ రూ.99కే కిలో చికెన్ అంటే ఎగబడి మరీ కొనేస్తారు కదా. అదే జరిగింది ఇక్కడ కూడా.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని భారత్ చికెన్ సెంటర్లో రూ.99 రూపాయలకు కిలో చికెన్ అమ్మకాలు చేపట్టారు. దీంతో మాంసం ప్రియులు బారులు తీరి దక్కించుకున్నారు. ముజ్జు అనే వ్యాపారి తన చికెన్ సెంటర్ లో రూ.99 రూపాయలకే కిలో చికెన్ అనడంతో జనాలు భారీగా క్యూ కట్టారు. అయితే.. ఇప్పుడేం పండగలు, జాతరలు లేవు కదా మరి ఒక్కసారిగా ఈ ఆఫర్లు ఏంటని ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.
అయితే, చికెన్ సెంటర్ ఓనర్ ముజ్జూ మాట్లాడుతూ.. తనకు కోళ్ల ఫారంలు ఉన్నాయని అప్పుడప్పుడు ఇలాగే చికెన్ విక్రయాలు తక్కువ ధరకే చేపడుతామన్నారు. ముఖ్యంగా ఏడాదికి ఒక్కసారి అయినా ఇలా తక్కువ ధరకే విక్రయాలు చేస్తామన్నారు. ఇప్పుడు కూడా మండల ప్రజలకు తక్కువ ధరలకే చికెన్ తినిపించాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు చికెన్ కిలో రూ.99 అమ్మకాలు ప్రకటించామని చెప్పారు.
సాధారణ సందర్భాలలో కూడా చికెన్ అమ్మకంలో బయట షాప్ లతో పోలిస్తే తక్కువ ధరలకే అమ్మకాలు చేస్తామని చెప్పారు. ఒకవిధంగా ఇలా ఏడాదికి ఒకసారి తక్కువ ధరకి అమ్మలు చేపట్టి తన షాప్ కి ఈ ఓనర్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఎలాగూ సొంత ఫామ్స్ ఉండడంతో తనకి ఆ ధరకి ఇవ్వడం వలన పెద్దగా నష్టం ఉండదని.. కొద్దిపాటి నష్టాలే వచ్చినా ఏడాది మొత్తం కస్టమర్లు తన వద్దే చికెన్ కొంటారు కనుక అది లెక్కలోకి రాదని చెప్తున్నాడు.