ఢిల్లీ : అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఎట్టకేలకు కోర్టు బోనెక్కనున్నారు. రాత్రంతా సీబీఐ గెస్టు హౌసులో చిదంబరాన్ని బందీగా ఉంచిన సీబీఐ వైద్య పరీక్షల తరువాత ఆయన్ని కోర్టుకు హాజరుపరచనున్నది.
కాంగ్రెస్ పార్టీకి ముఖ్య సీనియర్ నేతగా ఉన్న చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయ్యారు. ఈ అరెస్టు జరగడానికి ముందు చాలా తతంగమే నడిచింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం చిదంబరం చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సీబీఐ రంగంలోకి దిగడంతో మొదలైన హైడ్రామా సినీ ఫక్కీలో మలుపులు తిరిగి చివరికి అర్థరాత్రి చిదంబరం అరెస్టుతోె ముగిసింది.
హైకోర్టు తీర్పుపై స్టే కోసం వేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో చిదంబరం అరెస్టు చేయడానికి సీబీఐకి మార్గం సుగమం అయింది. తన అరెస్టు తప్పదని తెలుసుకున్న చిదంబరం అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయన కోసం సీబీఐ, ఈడీ బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఐతే, చిదంబరం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని ఈ సందర్భంగా చిదంబరం మీడియా ముందు చెప్పారు. ప్రెస్ మీట్ తరువాత చిదంబరం జోర్‌బాగ్‌లోని తన నివాసానికి వెళ్లారు. ఆయన వెంట కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఉన్నారు. తరువాత కొద్దిసేపటికి ముప్పయ్ మందితో కూడిన సీబీఐ బృందం అక్కడికి వచ్చింది. చిదంబరం ఉండే బంగ్లా తలుపును తట్టింది. అటు నుంచి స్పందన రాకపోవడంతో ముగ్గురు అధికారులు ఐదడుగుల ప్రహరీ గోడను ఎక్కి దూకి.. ఇంట్లోకి ప్రవేశించారు. వారు లోపల నుంచి తలుపులు తీయడంతో మిగిలిన అధికారులు లోపలికి ప్రవేశించారు. కాసేపటికి ఈడీ అధికారులూ అక్కడికి చేరుకున్నారు. సీబీఐ అధికారులు బంగ్లా వెనుక ద్వారం దగ్గరికి వెళ్లారు. వెలుపలికి వెళ్లే అన్ని మార్గాల దగ్గర సిబ్బందిని మోహరించారు. అరెస్టుకు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తిచేశాక చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక కారులో ఆయన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కారు మీదకు దూకి, అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు వారిని పక్కకు లాగేశారు. కోర్టు వారెంటుతోనే చిదంబరం అరెస్టు జరిగినట్టు సీబీఐ ప్రకటించింది.