ట్రయల్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆగమేఘాల మీద అనర్హత వేటు పడడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరువునష్టం కేసు ఏడాదిగా కోర్టులో నలుగుతూ వస్తోందని, అయితే పిటిషనర్ (రాహుల్) ని సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటించడం అసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ‘వేగం’ చూస్తే జమైకాకు చెందిన స్ప్రింటింగ్ లెజెండ్ ఉసేన్ బోల్ట్ సైతం అవాక్కవ్వాల్సిందే అన్నారు.
అసలీ కేసు నామమాత్రమైనదని, కానీ పిటిషనర్ కు కఠిన శిక్ష విధించారని చెప్పిన ఆయన.. తీర్పు చెప్పిన మేజిస్ట్రేట్ స్వయానా తానే దీన్ని నిలుపుదల చేశారని చెప్పారు. మంత్రి పీయూష్ గోయెల్ గానీ, ప్రభుత్వం గానీ దీనిపై వివరణ నిచ్చేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. చిన్న పొరబాటుకు ఒక వ్యక్తి రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలా ? అంటే మీరొక చట్టం మీద కూచుని విపక్ష సభ్యుని నోరు నొక్కేయవచ్చునని భావిస్తున్నట్టు కనబడుతోందన్నారు.
ఓ కేసు జాతీయ భద్రతకు సంబంధించినది కానప్పుడు కనీసం రెండేళ్ల జైలు శిక్ష అన్నది పార్లమెంట్ చట్టం ప్రకారం సబబు కాదన్న షరతు ఉందన్నారు. సూరత్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పైకోర్టుకెక్కుతామని చెప్పిన చిదంబరం.. తీర్పునకు, శిక్షకు మధ్య కాల విరామం ఎందుకు లేదన్నారు.
ఈ తీర్పు కేవలం 10 నిముషాల్లో ముగిసింది.. శిక్ష విధించడం క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ప్రత్యేక అంశం అని లీగల్ నిపుణుడు కూడా అయిన చిదంబరం పేర్కొన్నారు. ఇందులో ఇంకా ఎన్నో అంశాలను పరిశీలించవలసి ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి కేసుల్లో లోగడ కోర్టులు అనుసరించిన మార్గాలు, ప్రత్యర్థుల జోక్యానికి అవకాశాలు వంటివెన్నో చూడాల్సి ఉందని, వీటినేవీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పిన ఆయన.. వీటన్నింటి పైనా తాము కోర్టులో వాదిస్తామని తెలిపారు.