పార్లమెంటే సుప్రీం అంటూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ చేసిన వ్యాఖ్యలు తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం తోసిపుచ్చారు. పార్లమెంట్ కన్నా రాజ్యాంగం సుప్రీం అని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు గల అధికారాలు ప్రజాస్వామ్యానికి తప్ప మరే ఇతర అథారిటీకి లోబడి ఉండవని ధన్ కర్ నిన్న జైపూర్ లో జరిగిన 83 వ స్పీకర్ల సదస్సులో అన్నారు.
దీనిపై స్పందించిన చిదంబరం.. రాజ్యాంగానికి మించినది లేదని, ఒక చట్టాన్ని రద్దు చేసినంత మాత్రాన రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలే తప్పని అనజాలమని అన్నారు. నిజానికి ధన్ కర్ అభిప్రాయాలు .. ముందున్న ప్రమాదాలపట్ల అలర్ట్ గా ఉండాలని రాజ్యాంగాన్ని అభిమానించే ప్రతి వ్యక్తినీ హెచ్చరించేలా ఉండాలని చిదంబరం పేర్కొన్నారు.
నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టాన్ని రద్దు చేస్తే.. ఓ కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వాన్ని ఎవరూ ఆపడం లేదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ చట్టాన్ని లోగడ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ధన్ కర్ నిన్నటి తన ప్రసంగంలో గుర్తు చేశారు. అయితే మెజారిటీ ఓటింగ్ ద్వారా పార్లమెంటరీ సిస్టంను ప్రెసిడెన్షియల్ సిస్టంగా మార్చడానికి, లేదా షెడ్యూల్ ఏడు లోని స్టేట్ లిస్ట్ ని రద్దు చేసి.. రాష్ట్రాల లెజిస్లేటివ్ అధికారాలను హరించడానికి ఉద్దేశించి ఏదైనా సవరణ చేస్తేఅది చెల్లుతుందా అని చిదంబరం ప్రశ్నించారు.