ఐఎన్ ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో జైలు పాలైన కేంద్ర మాజీ హోం మంత్రి కె.చిదంబరం కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 106 రోజులుగా చిదంబరం తీహార్ జైల్లో ఉంటున్నారు. నవంబర్ 15 న చిదంబరం బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్ట్ తిరస్కరించింది. కేసులో ఆయనపై ప్రాధమిక ఆధారాలు బలంగా ఉన్నాయని..కేసులో ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఉందంటూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నాశ్రయించారు. చిదంబరం వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు ష్యూరీటిలతో పాటు రూ.2 లక్షల డిపాజిట్ చేయమంది. దేశం విడిచి వెళ్లవద్దని, సమావేశాల్లో పాల్గొనవద్దని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని, ఈ కేసులో ఇతర నిందితులను కలవవద్దని కోర్టు షరతులు విధించింది.
నిందితుడు బయటకు వస్తే కేసులో సాక్ష్యులను ప్రభావితం చేస్తారని…జైల్లో ఉండే కేసును ప్రభావితం చేసేలా ప్రవర్తించినందున బెయిల్ ఇవ్వవద్దని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అయితే ప్రభుత్వ వాదనలో నిజం లేదని..అలాంటివి ఏమైనా ఉంటే ఆధారాలు చూపించాలని చిదంబరం తరపు అడ్వకేట్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ లు వాదించారు.