ఢిల్లీ : నోటి వరకు వచ్చింది గొంతుకు అడ్డం పడిందంటే ఇదే.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి సుప్రీంకోర్ట్ రిలీఫ్ ఇచ్చింది. కానీ, అది ఆయనకు ఉపయోగం లేకుండాపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఈ నెల 26వ తేదీ వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించింది. ఇదే కేసులో చిదంబరం సీబీఐ కస్టడీలో వుండి విచారణను ఎదుర్కొంటున్నారు. సీబీఐ కస్టడీ ఆగస్టు 26నే ముగుస్తోంది. దానివల్ల సుప్రీంకోర్టు ఇప్పుడిచ్చిన ఆదేశాల వల్ల ఆయనకు ఎలాంటి ఉపయోగం లేదు. చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దని ఈడీ వాదించినప్పటికీ.. సుప్రీం కోర్టు ఆ వాదనను తిరస్కరించింది. ఈడీ, సీబీఐ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలన్న చిదంబరం అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 20న తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. తనను ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఆగస్టు 26న విచారణ జరుపుతామనీ, అప్పటివరకు చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తున్నామని జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలావుంటే, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల అన్ని లావాదేవీల వివరాలు తమకు అందివ్వాలని బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, మారిషస్, బెర్ముడాలకు సీబీఐ లెటర్ రొగేటరీలను (ఎల్‌ఆర్) పంపించింది.