దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి పడిపోయిందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో మూడు రోజుల ‘చింతన్ శివిర్’లో ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థపై ప్యానెల్‌కు చిదంబరం సారథ్యంవహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలు నేడి నుండి ఆదివారం వరకు జరుగుతాయని తెలిపారు.
అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత దేశ ఆర్థిక విధానాలను రీసెట్ చేయాల్సిన అవసరముందని సూచించారు. ప్రస్తుతం దేశ ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యం కాని స్థాయికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ టోకు ధరల సూచీ 14.55 శాతం.. వినియోగదారుల ధరల సూచీ 7.79 శాతంగా ఉందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తన తప్పుడు విధానాలతో ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులు, అధిక ధరలు, అధిక వస్తు సేవల పన్ను రేట్లు వంటి వాటి ద్వారా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కేంద్రం ఆజ్యం పోస్తోందని చిదంబరం అన్నారు.
దేశంలో ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపుతూ.. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చారిత్రాత్మకంగా 40.38 శాతం వద్ద ఉందన్నారు. నిరుద్యోగిత రేటు 7.83 శాతంగా ఉందని అన్నారు. 2004 నుండి 2014 మధ్య సగటున 9 శాతం ఉన్న మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం సగటున 5 శాతానికి పడిపోయిందని ఆరోపణను పునరుద్ఘాటించారు చిదంబరం.