దళిత, ఆదివాసీ విద్యార్థుల్లో చాలా మంది ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. అట్టడుగు వర్గాల విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఎక్కువ మంది దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన వారేనని పరిశోధనల్లో వెల్లడైందన్నారు.
నల్సార్ లా యూనివర్సిటీ 19వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయశాస్త్ర విద్యార్థులకు పీహెచ్‌డీ, ఎల్ఎల్ఎం, బీఏ ఎల్ఎల్‌బీ (ఆనర్స్) తదితర విభాగాలకు డిగ్రీ పట్టాలను అందజేశారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. దళిత, ఆదివాసీ విద్యార్థుల్లో చాలా మంది ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. వారిపై సానుభూతి సానుభూతి లేకపోవడమే వివక్షకు కారణమని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి వాటిపై న్యాయమూర్తులు సరైన తీర్పులు వెల్లడించాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో చాలామంది న్యాయం కోసం చివరికి వచ్చేది న్యాయస్థానాలకేనని ఆయన అన్నారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల పాత్ర కీలకమైనదని తెలిపారు.
కరోనా సమయంలోనూ న్యాయమూర్తులు చాలా బాగా పనిచేశారని ఆయన కితాబిచ్చారు. న్యాయ శాస్త్రం తెలుసుకునేందుకు ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉందని వెల్లడించారు. న్యాయ విద్యకు సంబంధించి దేశంలో మరిన్ని విద్యా సంస్థలు రావాలన్నారు.