పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను పదవి నుంచి తొలగిస్తున్నట్టు మాన్ ప్రకటించారు.
కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 1శాతం కమిషన్ డిమాండ్ చేశారని షింగ్లాపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కీలకమైన సాక్ష్యాదారాలు లభించడంతో షింగ్లాకు ఉద్వాసన పలికినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది.
‘ రాష్ట్రంలో కనీసం ఒక్క శాతం అవినీతి జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎన్నో ఆకాంక్షలతో ప్రజలు ఆప్ కు పట్టం గట్టారు. వారి అంచనాలను అందుకునే విధంగా పనిచేయడం మన బాధ్యత. రాష్ట్రంలో అవినీతిని పారదోలేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలో కృషి చేస్తాం’ అని సీఎం అన్నారు.
అవినీతి నిర్మూలన లక్ష్యంగా పని చేస్తానని ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కు మాట ఇచ్చానని తెలిపారు. మంత్రికి సంబంధించి అవినీతి కేసు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ విషయం మీడియాకు కూడా తెలియదన్నారు.
తాను కావాలనుకుంటే ఈ విషయాన్ని దాచిపెట్టవచ్చని అన్నారు. కానీ అలా చేస్తే లక్షలాది మంది ప్రజలను మోసం చేసిన వాడిగా చరిత్రలో మిగిలిపోతానని పేర్కొన్నారు. అందుకే మంత్రినూ కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.