మహారాష్ట్రలో మరో కీలక ఘట్టం ముగిసింది. తాజాగా ఏక్ నాథ్ షిండే సర్కార్ బల పరీక్షలో నెగ్గింది. ఫ్లోర్ టెస్టులో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు షిండే సర్కార్ కు అనుకూలంగా ఓటు వేశారు.
బల పరీక్షను మూజువాణీ ఓటు పద్దతిలో ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓట్ల విభజన పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేశాయి.
దీంతో ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఒకవైపు, వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు మరోవైపు కూర్చోవాలని స్పీకర్ సూచించారు.అనంతరం సభ్యులను హెడ్ కౌంట్ చేశారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా, మహా వికాస్ అఘాడి కూటమికి చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు ఫ్లోర్ టెస్టుకు గైర్హాజరయ్యారు.
అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన వెంటనే రాహుల్ నార్వేకర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శివసేన పక్షనేతగా ఉన్న అజయ్ చౌదరీని తొలగించి ఆయన స్థానంలో ఏక్ నాథ్ షిండేను నియమించారు.
ఆ తర్వాత శివసేన చీఫ్ విప్ గా ఉన్న సునీల్ ప్రభును కూడా స్పీకర్ ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఛీఫ్ విప్ గా భరత్ గాగావాలేను నియమించారు.