తెలంగాణలో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయి. కరోనా వైరస్ వచ్చిన మొదట్లో భయంతో జనం చికెన్ తినేందుకు వెనుకంజ వేశారు. అప్పట్లో చికెన్ కిలో కేవలం 30రూపాయలకే ఇచ్చినా కొనేవారు కరువయ్యారు. కానీ ఆ తర్వాత కరోనా వైరస్ కోళ్ల ద్వారా వ్యాప్తి చెందదని దృవీకరించటంతో మళ్లీ అమ్మకాలు పెరిగాయి.
మళ్లీ ఇప్పుడు దేశాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తుండటంతో… చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు కిలో చికెన్ ధర 200రూపాయల వరకు పలకగా, ఇప్పుడు 120రూపాయల వరకు దిగివచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పడిపోయే అవకాశం ఉంది.
అయితే, గతంలో చికెన్ పై అపనమ్మకం పొగొట్టి సేఫ్ అని చెప్పేందుకు మంత్రులు కేటీఆర్ తో పాటు పలువురు నేతలు లెగ్ పీస్ చేతిలో పట్టుకొని… మేం తింటున్నాం, మీరు కూడా లాంగించేయండి… అంటూ సందేశం వినిపించారు. ఇప్పుడు కూడా మళ్లీ మంత్రి కేటీఆర్ చేతిలో లెగ్ పీస్ పట్టుకొని మీడియా ముందుకు వస్తే తప్పా మా అమ్మకాలు పెరిగేలా లేవు, లేదంటే ఇంకా పడిపోతాయేమో అంటూ చికెన్ అమ్మకందార్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. పక్షుల సముహాలు ఉన్న చోట అలర్ట్ గా ఉండాలని… ప్రజలంతా చికెన్, గుడ్లు బాగా ఉడికించిన తర్వాతే తినేలా ప్రాచుర్యం చేయాలని ఆదేశించింది.