ఇండస్ట్రీలో ఒక్కో సీజన్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. అప్పట్లో అంతా ఫ్యాక్షన్ కథలు వెంటపడ్డారు. ఆ తర్వాత ప్రేమకథలు, కామెడీ సినిమాలొచ్చాయి. ఆమధ్య హారర్-కామెడీ జానర్ బాగా ఒంటపట్టించుకున్నారు. ఇక ఇప్పుడు మేకర్స్ అంతా ఛైల్డ్ సెంటిమెంట్ వెంట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాలు రీసెంట్ గా చిన్న పిల్లల సెంటిమెంట్ తో వచ్చాయి, పెద్ద హిట్టయ్యాయి.
బింబిసార.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ఇది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ ఫాంటసీ సినిమాలో ఛైల్డ్ సెంటిమెంట్ ఉంది. అతి క్రూరుడైన బింబిసారుడి మనసును ఓ చిన్నారి కరిగిస్తుంది. ఆ చిన్నారి కోసం కాలాలు దాటి మరీ భువికొస్తాడు బింబి. తన ప్రాణాలు అడ్డేసి, పాప ప్రాణాలు కాపాడతాడు. ఈ సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అయినట్టుంది. ప్రస్తుతం థియేటర్లలో కాసుల వర్షం కురుస్తోంది.
ఈ సినిమా కంటే ముందు అఖండ వచ్చింది. ఇందులో కూడా ఛైల్డ్ సెంటిమెంట్ ఉంది. భవబంధాలకు దూరంగా అఘోరాగా మారి జీవితాన్ని సాగించే అఖండ మనసును ఓ చిన్నారి కరిగిస్తుంది. ఆ పాప కోసం తను కూడా కుటుంబంలో ఒకడిగా మారిపోతాడు అఖండ. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కథ అంతా ఒకెత్తయితే, ఈ ఛైల్డ్ సెంటిమెంట్ మరో ఎత్తు.
ఇక ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా చైల్డ్ సెంటిమెంట్ తోనే వచ్చింది. 1940 బ్యాక్ డ్రాప్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, భారీ సెట్స్, కళ్లుచెదిరే గ్రాఫిక్స్… ఇలా ఎన్ని హంగులు పెట్టుకున్నప్పటికీ.. ఈ సినిమా కోర్ పాయింట్ ఛైల్డ్ సెంటిమెంట్. తన తండాకు చెందిన చిన్నారిని బ్రిటిషర్లు ఎత్తుకెళ్లిపోతే, ఆ పాపను విడిపించేందుకు ఏకంగా తెల్లోళ్ల కోట గోడలు బద్దలుకొడతాడు కొమురం భీమ్.
ఇలా ఈమధ్య కాలంలో ఛైల్డ్ సెంటిమెంట్ తో వచ్చిన 3 సినిమాలూ హిట్టయ్యాయి. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఈ సెంటిమెంట్ తో మరిన్ని సినిమాలు వచ్చేలా ఉన్నాయి. అదే కనుక జరిగితే టాలీవుడ్ లో మరో ట్రెండ్ మొదలైనట్టే.