తాను నటించిన చిత్రం ‘చెల్లే షో’ ఆస్కార్ ఎంట్రీకి నోచుకుంది. ఈనెల 14 న రిలీజ్ కానుంది. కానీ ఆ బాల నటుడికి అదృష్టం దక్కలేదు. తన పదేళ్ల వయస్సులోనే కన్ను మూశాడు. రాహుల్ కోలీ అనే కుర్రాడు ఈ నెల 2 న ల్యుకేమియా వ్యాధితో అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో మరణించాడు. ఈ చైల్డ్ స్టార్ నటించిన చెల్లే షో సినిమా ని 12 రోజుల క్రితమే గుజరాతీ భాషా చిత్రాల్లో భారత అధికారిక ఎంట్రీ మూవీగా సెలెక్ట్ చేశారు. 95 వ అకాడమీ అవార్డులకు ఇది ఇండియా నుంచి ఈ ఎంపికకు నోచుకుంది.
ఇందులో రాహుల్ ఓ రైల్వే సిగ్నల్ మన్ కొడుకుగా ‘మను’ అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆరుగురు బాల నటులు నటించారు. ఈ చిత్ర దర్శకుడు పాన్ నలిన్.. రాహుల్ మరణ సమాచారం తెలిసి షాక్ తిన్నారు. తామంతా ఇతని కుటుంబానికి అండగా ఉన్నామని, కానీ ఇతడిని రక్షించలేకపోయామని ఆయన విచారంగా వ్యాఖ్యానించారు.
రాహుల్ కోలీ అహ్మదాబాద్ లోని గుజరాత్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో నాలుగు నెలలుగా చికిత్స పొందుతున్నాడు. కానీ బ్లడ్ క్యాన్సర్ అన్నది పూర్తిగా నిర్ధారణ కాలేదు.. ఆ తరువాతే ఇతనికి బ్లడ్ క్యాన్సర్ సోకిందని తెలిసింది.
చెల్లే షో సినిమా షూటింగ్ ముగిసిన తరువాతే తమ రాహుల్ కి ఈ భయంకర వ్యాధి సోకినట్టు ఇతని కుటుంబం విలపిస్తూ చెప్పింది. ఈ నెల 14 న ఈ మూవీ రిలీజ్ కానుందని, ఆరోజు తామంతా తమ కొడుకు నటించిన ఈ సినిమా చూస్తామని ఆటో డ్రైవర్ అయిన ఇతని తండ్రి తెలిపాడు.