ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిశువిక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. వారి నుండి ఒక శిశువును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారపు స్వరూప, ఓదేల అనితలు స్నేహితులు. వీరికి గత కొద్ది రోజుల క్రితం సిద్దిపేటకు చెందిన ట్రాన్స్ జెండర్ సునీతతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో తను పెంచుకోనేందుకు గాను ఒక ఆడ శిశువు అందజేస్తే పెద్ద మొత్తంలో డబ్బు అందజేస్తానని ట్రాన్స్ జెండర్ సునీత.. స్వరూప, అనితలకు చెప్పింది. డబ్బుపై ఆశతో వాళ్లకు పరిచయం ఉన్న మరో నిందితురాలు శారదకు విషయాన్ని చెప్పారు.
ఆడ శిశువు అప్పగించేందుకు గాను నిందితురాళ్ళ మధ్య 2.50 లక్షల రూపాయలకు ఒప్పందం కుదరటంతో.. శారద ఆడశిశువును తీసుకోని గత నెల 22న వరంగల్ లో ట్రాన్స్ జెండర్ సునీతకు అందజేసింది. ఒప్పందం ప్రకారం.. ట్రాన్స్ జెండర్ సునీత శారదకు డబ్బులను అందజేసింది. పాపతో సిద్దిపేటకు వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ శిశువుకు ప్రాణంతకమైన వ్యాధి ఉందని గుర్తించిన ట్రాన్స్ జెండర్ సునీత.. ఆ శిశువు స్థానంలో మరో శిశువును అందజేయాల్సిందిగా శారదపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో శారద ఈ నెల 10న మహరాష్ట్రకు చెందిన మిగితా నిందితురాళ్ళు.. మరో ఆడశిశువుని తీసుకొచ్చి వరంగల్ బస్టాండ్ పరిసరాల్లోని లాడ్జ్ లో సునితకు అందజేశారు.
కానీ.. అందుకు ఎక్కువ డబ్బును డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన నిందితురాలు శారద.. మహరాష్ట్రకు చెందిన నిందితురాళ్ళ వద్ద ఉన్న శిశువు లాక్కోని సునిత చేతిలో పెట్టి.. అనారోగ్యంతో బాధపడుతున్న శిశువుని వారిచేతిలో పెట్టి లాడ్జ్ నుండి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఘటనపై సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫెర్ విభాగం అధికారులు అక్కడికి చేరుకొన్నారు. లాడ్జ్ లో వున్న మహరాష్ట్రకు చెందిన నిందితురాళ్ళు అనురాధ, శీలా, సల్మాలను నిలదీశారు. వాళ్ల వద్ద ఉన్న శిశువు గురించి అధికారులు విచారించారు. దీంతో శిశువు తల్లిని తీసుకవస్తామని చెప్పి అక్కడినుండి తప్పించుకున్నారు.
చైల్డ్ వెల్పైర్ విభాగం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇంతేజా గంజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి శిశు విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకోని పారిపోయిన మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు.. వరంగల్ కు చెందిన నిందితురాలు స్వరూప పిలుపునందుకొని మంగళవారం ఉదయం వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యానవనానికి వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి విచారించగా వారు చేసిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించినట్టు సీపీ తెలిపారు.