సహజంగా నాలుగేళ్లు నిండిన పిల్లలను పాఠశాలకు పంపిస్తారు తల్లిదండ్రులు. తొలుత వారిని నర్సరీలో చేర్పించి.. తర్వాత ఎల్‌కేజీ, యూకేజీ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ కు పంపిస్తుంటారు. కానీ.. కరోనా కారణంగా రెండేళ్లు విద్యా వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా మొదటి తరగతిలో చేర్పిస్తున్నారు. కారోనా కారణాలతో ఇంటర్, డిగ్రీ విద్యార్ధులకే కాదు.. నర్సరీ పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు లభించాయంటున్నారు కొందరు తల్లిదండ్రులు.
దీంతో చాలామంది పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివే అవకాశం ఉండడం లేదు. కార్పొరేట్, టెక్నో స్కూళ్లు పిల్లలకు నర్సరీ నుంచి క్లాసులు చెబుతూ.. వారిని క్రమక్రమంగా తీర్చిదిద్దుతుంటాయి. తద్వారా ఉన్నత తరగతులకు వెళ్లిన తర్వాత పిల్లల్లో బోధనా సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే.. కరోనా తెచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడంలో భాగంగా పిల్లల్లో సామర్థ్యాలు పరిశీలించకుండానే కొన్ని విద్యాసంస్థలు సీట్లను భర్తీ చేస్తున్నాయి.
గతానికంటే ఫీజులు పెంచినా తల్లిదండ్రులు సీట్లను పొందేందుకు పోటీ పడుతున్నారు. ఉదాహరణకు అత్తాపూర్ లోని ఓ కార్పొరేట్ స్కూల్ లో 2021-22 అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ ఫీజు రూ.45వేలు ఉందంట. అయితే.. ముందస్తు అడ్మిషన్ పేరిట ఇటీవల రూ.65 వేలు తీసుకుంది స్కూల్ యాజమాన్యం. బస్సు ఫీజు అదనంగా మరో రూ.20వేలు. అయినప్పటికీ.. ఆ స్కూల్ లో సీట్లు ఫుల్ అయ్యాయి. ఎప్పుడూ లేనిది ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతి అడ్మిషన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని కొందరు పేరెంట్స్ అంటున్నారు.
2022-23 నూతన విద్యా సంవత్సర అడ్మిషన్లకు మరో నాలుగు నెలల గడువున్నప్పటికీ.. పేరున్న కార్పొరేట్, టెక్నో స్కూళ్లు గేట్లు మూసివేశాయి. డిమాండ్ ను బట్టి ముందుగానే అడ్మిషన్లను పూర్తి చేసుకున్నట్టు సమాచారం. కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలకు సీట్లు దొరకని కొందరు తల్లిదండ్రులు బడ్జెట్ స్కూళ్ల వైపు దృష్టి సారిస్తున్నారు.
అడ్మిషన్లపై దృష్టిసారించి పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు.. పిల్లల మానసిక స్థితిని పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో నర్సరీ నుంచి చదువు మొదలైతే.. పిల్లలు ఆటపాటలతో సులువుగా ముందుకుసాగుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు. నేరుగా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేస్తే బోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమగ్రమైన విద్యతోనే పిల్లల్లో పఠనాశక్తి పెరుగుతుందంటున్నారు. ప్రైవేట్ మాయలో పడి పిల్లలను మానసిక ఇబ్బందులకు గురిచేయొద్దని సూచిస్తున్నారు.