కేంద్ర ప్రభుత్వ కొత్త ఆదేశాల ప్రకారం… జనవరి 1, 2022 నుండి 15-18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు అందుబాటులో ఉంటాయనే సంగతి తెలిసిందే. కరోనా కేసులు పిల్లల మీద ప్రభావం చూపించకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తుంది. ఇక పిల్లలు తమ వివరాలను కోవిన్ యాప్ లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ ప్రకటన తర్వాత కేంద్రం దూకుడుగా అడుగులు వేస్తుంది.
సోమవారం మీడియాతో మాట్లాడిన కోవిన్ ప్లాట్‌ఫారమ్ చీఫ్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ పిల్లలు తమ రిజిస్ట్రేషన్ కోసం వివిధ సెట్ల పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. యాప్‌లో పిల్లలు నమోదు చేసుకునేందుకు కొత్త ఆప్షన్‌ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. యాప్‌లో పిల్లలు నమోదు చేసుకోవలసిన పత్రాలు ఒక్కసారి చూస్తే… ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుందని అయితే ఇప్పటికీ ఆధార్ కార్డ్ లేని వారు తమ 10వ తరగతి ఐడి కార్డును సమర్పించవచ్చు అని పేర్కొన్నారు. ఇతర ఏ ఐడి కార్డు లేకపోయినా సరే స్కూల్ ఐడి కార్డు ఉంటె చాలని పేర్కొన్నారు.
డిసెంబర్ 25న, ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా వ్యాక్సిన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక దేశ ప్రజలను ఓమిక్రాన్ కాస్త కంగారు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భారత్ బయోటెక్ 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది.