రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పేర్లు మారుతున్నాయి తప్ప పరిస్థితి మాత్రం మారడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. దీంతో.. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్లు కనిపెట్టాయి. కరోనా టీకాలు అందుబాటులోకి రావడంతో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా.. వాటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మనలో తయారవుతోంది.
దీంతో.. మహమ్మారి బారిన పడినా.. మృతుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుంది. అయితే.. చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటే వారి పిల్లలకు వైరస్ నుంచి రక్షణ ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, ఇజ్రాయెల్‌లోని క్లాలిట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు టెల్‌అవివ్ యూనివర్సిటీ నిపుణులు చేపట్టిన అధ్యయనంలో ఈ శుభవార్త తెలిసింది.
డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగిన జూన్-అక్టోబర్ 2021 మధ్యకాలంలో ఈ అధ్యయనం చేశారు. 76వేల కుటుంబాల నుంచి లక్షా 81 వేల చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని తీసుకొని పరిశీలించారు. అందులో వారి తల్లదండ్రులు తీసుకున్న వివరాలను బట్టి రీసెర్చ్ చేశారు. బూస్టర్ డోసు తీసుకున్న తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు ఇన్‌ఫెక్షన్ సోకే ముప్పు 20 శాతం తగ్గనట్టు గుర్తించారు. రెండో బూస్టర్ తీసుకున్న వారి నుంచి 58 శాతం ముప్పు తప్పుతున్నట్లు వారి అధ్యయనంలో తేల్చారు.
డిసెంబర్ 2020- మార్చి 2021 మధ్యలో కూడా 4 లక్షల మంది చిన్నారులపై జరిపారు. ఇలా జరిపిన రెండు అధ్యయనాల్లో కూడా తల్లదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటే పిల్లలకి ముప్పు తక్కువగా ఉందని గుర్తించారు. బూస్టర్ డోసులు తీసుకుంటే మరింత రక్షణ కలుగుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.