హైదరాబాద్: రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి లేదంటూ మంత్రి ఈటల రాజేందర్ చెప్పడాన్ని బాలల హక్కుల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది పిల్లలూ, పెద్దలు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతుంటే, అసలు ఈ రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధే లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడం దారుణమని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. ఈ ప్రకటన బాధ్యత నుంచి తప్పుకోవాలని చూసే బాధ్యతా రాహిత్య ప్రకటన అని దుయ్యబట్టారు. డెంగ్యూ నివారణకు చర్యలు చేపట్టకుండా అసలు డెంగ్యూ వ్యాధే లేదని చెప్పడం వ్యాధి బాధితులను తప్పుతోవ పట్టించడమేనని అన్నారు. చికిత్సకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వ్యాధి తీవ్ర రూపం దాల్చేలా మాట్లడటం మంత్రి స్ధాయికి తగదని విమర్శించారు. మంత్రి ఈటల వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. డెంగ్యూ వ్యాధి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.