జీవో 317తో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంత అవస్థ పడుతున్నారో కళ్లకు కట్టే ఫోటో ఇది. తండ్రి ఒకచోట, తల్లి మరోచోట.. ఎవరి దగ్గరకు వెళ్లాలో.. ఎక్కడ ఉండాలో అనే అయోమయంలో ఉన్న చిన్నారులు… ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నిలదీసిన ఫోటో ఇది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఒక రకంగా కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టినట్లు సెటైర్ వేశారు. తల్లికి ఒక జిల్లా, తండ్రికి మరో జిల్లా కేటాయించడంతో తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. తాము ఏ జిల్లాకు వెళ్లాలి కేసీఆర్ తాత అంటూ ముగ్గు రూపంలో ప్రశ్నించారు.
రాష్ట్రంలోని 19 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ భార్యాభర్తలకు ఒకేచోట పోస్టింగ్ ఇచ్చారు. మిగతా జిల్లాలకు చెందిన వారికి మాత్రం వేర్వేరు చోట్ల కేటాయించారు. ఇదే విషయంపై మొన్న ప్రగతి భవన్ ను ముట్టడించారు ఉపాధ్యాయులు. తమకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ చిన్నారులు తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి.. వారిని వేర్వేరుగా చూడలేక.. విడిచి ఉండలేక ఇలా ముగ్గు వేసి కేసీఆర్ ను ప్రశ్నించారు.
మరో మరో చిన్నారి.. వీడియో రూపంలో తన బాధను వివరించింది. తన తల్లికి చాలా దూరం ట్రాన్స్ ఫర్ చేశారని.. ఆమెకు దూరంగా తాను ఉండలేనని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.