చిలీలోని ఈస్టర్ దీవులు ఒకప్పుడు అద్భుతమైన ‘మోయ్’ శిలా విగ్రహాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వీటిని స్థానికులు పవిత్ర విగ్రహాలుగా భావిస్తారు. కానీ ఇటీవల రేగిన కార్చిచ్చు కారణంగా వీటి రూపు రేఖలు మారిపోయి చాలావరకు దెబ్బ తిన్నాయి. ఈ దీవుల్లో 60 హెక్టార్లకు పైగా వ్యాపించిన మంటలు అనేక శిలా విగ్రహాలను డ్యామేజ్ చేశాయని చిలీ సాంస్కృతిక, హెరిటేజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ మంటలకు కారణం తెలియడంలేదని, ఎంత మేరకు నష్టం జరిగిందన్నదానిపై ఆరా తీస్తున్నామని పేర్కొంది. నిజానికి ఇక్కడ ‘రానో రరాకూ అగ్నిపర్వతం’ విస్ఫోటనం చెందిన ఫలితంగా ఏర్పడిన పెద్ద గొయ్యి కూడా ఉంది.. ఈ ప్రాంతాన్ని యునెస్కో వాల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇక్కడి ‘రాపా నూ నేషనల్ పార్క్’ వద్ద ‘మోయ్’ శిలా విగ్రహాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ మంటల్లో మసిబారిపోయాయి.
ఇది చాలా విచారకరమని, ప్రకృతి సౌందర్యానికి కోలుకోలేని దెబ్బ అని ఈస్టర్ దీవుల మేయర్ పెడ్రో ఎడ్మండ్స్ అన్నారు. ఈ శిలలన్నీ పగుళ్లు విచ్చాయని, త్వరలో శాస్త్రజ్ఞులు, నిపుణులు వచ్చి నష్టం అంచనా వేస్తారని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఇవి వర్షాలు, ఎండలు, విపరీతమైన గాలుల వల్ల చాలావరకు దెబ్బ తిన్నట్టు స్థానికుడొకరు తెలిపారు. చిలీ కోస్తా తీరానికి ఈస్టర్ దీవులు రెండు వేల మైళ్ళ దూరంలో ఉన్నాయి. ఈ దీవుల్లోకి ఇటీవలే టూరిస్టులను అనుమతించడం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా వీటి సరిహద్దులను మూసివేశారు. మోయ్ శిలా విగ్రహాల పరిరక్షణకు ప్రభుత్వం నుంచి తమకు తగినంత సహకారం లభించడం లేదని ఎడ్మండ్స్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి వీటి భద్రతకు తమకు సహకరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.