చిలీలో కార్చిచ్చు రగులుకుంది. ఈ కార్చిచ్చు ధాటికి 13 మంది మరణించారు. సుమారు 190కి పైగా ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగాయని అధికారులు తెలిపారు. 14 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతంపై దీని ప్రభావం పడినట్టు అధికారులు తెలిపారు.
కార్చిచ్చు అటవీ ప్రాంతాలకు సమీపంలో సుమారు 2వేల ఇండ్ల వరకు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు తెలిపారు. సుమారు 10వేల మంది నిరాశ్రయులు అయినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ పెను ప్రమాదాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది.
వేసవి వడగాలుల నేపథ్యంలో కార్చిచ్చులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. గాలుల వల్ల మంటలు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. మంటలు ఆర్పేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలిపోయినట్టు పేర్కొంది.
ఈ ఘటనలో పైలట్ మృతి చెందారని చెప్పింది. దేశవ్యాప్తంగా 191 ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగిందని, 45 ప్రాంతాల్లో మాత్రమే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారని చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ వివరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. కార్చిచ్చును అదుపు చేసేందుకు అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల నుంచి విమానాలు వస్తున్నాయని అధికారులు అన్నారు.