– ఆదివాసీలకు ఎంతో సేవ చేశాము
-స్త్రీని పూజించిన సంప్రదాయం నుంచి వచ్చాను
-కావాలనే కలతలు సృష్టించే యత్నాలు!
– నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు
– మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగొద్దు
– చిన జీయర్ సంచలన వ్యాఖ్యలు
తాడేపల్లి, తొలివెలుగు: ఆదివాసీలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి తాము వచ్చామని.. వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తమకు లేదని చినజీయర్ స్వామి అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు.తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు. పూర్వాపరాలు చూడాలని.. మధ్యలో మాట్లాడిన ఒక మాటను చూపించి విమర్శించడం సరికాదన్నారు.
ఆ దేవతలు స్వర్గం నుంచి దిగిరాలేదని..గ్రామసీమల్లో ఉంటూ మన కోసం పాటుపడ్డ మహోన్నతులే సమ్మక్కసారలమ్మ లు అన్నదే తన ఉద్దేశ్యం అన్నారు. ఆదివాసీలైనా..ఇంకెవరైనా పుట్టుకపరంగా కాకుండా.. జ్ఞానం ఆధారంగా వారిని ఉత్తములుగా భావించాలని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఎక్కడైనా..అసాంఘిక కార్యక్రమాన్ని ప్రోత్సహించవద్దనేదే తమ సూచన అని స్పష్టం చేశారు చినజీయర్. నిర్వహణ కోసమే సమతామూర్తి విగ్రహం చూడడానికి టికెట్ పెట్టామని స్పష్టం చేశారు.అంతేగాని అక్కడ పూజలకు, ప్రసాదాలకు టికెట్లు లేవని గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పారు. మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగవద్దన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.విషయం తెలుసుకోకుండా ప్రశ్నలు అడగవద్దని ఘాటుగా మాట్లాడారు చినజీయర్ స్వామి.
ఇవాళ లక్ష్మీ దేవీ పుట్టిన రోజు. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి దగ్గరకు చేరిన రోజు.ఈ రోజును అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవంగా భావించాలని పేర్కొన్నారు జీయర్ స్వామి. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలోని మహిళలందరికీ మంగళాశాసనాలు తెలియ చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎవరికి జ్ఙానం విలక్షణంగా ఉంటే.. వారికి ఆరాధ్య స్థానం కల్పించాలని రామానుజాచార్యులు సూచించారని పేర్కొన్నారు.
సమాజం అనే వేదిక మీద అంతా కలిసి ముందుకు సాగాలని సూచించారు. ఒక వేదిక దొరికిందని రకరకాలుగా మాట్లాడడం మంచిది కాదని విమర్శించారు.తాత్కాలిక ప్రయోజనాల కోసం, పబ్లిసిటీ కోసం ప్రజల్ని రెచ్చగొట్టడం సరికాదని మండిపడ్డారు. సమాజ హితం కాంక్షించేవారు కూర్చుని ఆలోచించాలని హితవు పలికారు. ఆదివాసీలను గౌరవించే సంప్రదాయం ఉండాలని రామానుజాచార్యులు సూచించారన్నారు. 1938లోనే తూర్పుగాదావరి జిల్లాలోని అత్తలూరులో శ్రీమన్నారాయణ హరిజన కాలనీ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల కోసం స్కూలును 2004లో ప్రారంభించామని వివరించారు.
నారీమణులందరికీ మంగళాశాసనాలు చేస్తున్నామన్నారు. శ్రీరంగం క్షేత్రంలో అమ్మవారు,అయ్యవారు కలిసి ఉంటారని.. అమ్మ వారితో కలిసి ఉండగానే అయ్యవారిని ఆశ్రయించాలన్నారు. ఒక జంతువు,పక్షి,ఆకు,మనం తినే ఆహారంతో కలిసి ఉంటుందన్నారు. మనిషి ప్రకృతిని, ప్రాణ కోటిని పూజిస్తామని.. అందులో భాగంగానే దసరా నాడు జమ్మి చెట్టును పూజిస్తామని చెప్పారు. అపార్థాలకు తావివ్వకుంటే సమాజం బాగుంటుందని చెప్పారు చినజీయర్ స్వామి.