చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ – 737 విమానం మార్చి 21న ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 132 మంది సజీవదహనమయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. విమానం కూలిపోయినప్పుడు విమానం కొన్ని వేల ముక్కలైంది. అందులో ఇప్పటిదాకా 36 వేల ముక్కలను స్వాధీనం చేసుకున్నామని చైనా పౌర విమానయాన నియంత్రణ సంస్థ అధిపతి ఝూ టావో చెప్పారు.
ఇప్పటికే ఆ విమానానికి సంబంధించిన రెండు బ్లాక్ బాక్స్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కేవలం ఈ రెండు బ్లాక్ బాక్స్‌లు అందించిన డేటా ఆధారంగా మాత్రమే ప్రమాదానికి గల పూర్తి కారణాలను చెప్పలేమని వారు చెప్పారు. బ్లాక్ బాక్స్‌ల నుంచి సేకరించిన డేటాతోపాటు, విమాన శిధిలాలను, ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వీడియో ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అయితే, చైనా భూభాగంలో గత 28 ఏళ్లలో ఇంత పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు రెస్క్యూటీమ్ భారీ స్థాయిలో రంగంలోకి దిగిందని గ్వాంగ్షీ ఫైర్ అండ్ రెస్క్యూ కోర్ అధిపతి ఝెంగ్ షీ చెప్పారు. 15 వేల మంది సహాయ సిబ్బంది విమాన శకలాల కోసం గాలింపు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 3.7 లక్షల చదరపు మీటర్ల మేర గాలింపు సాగించారని, విమానశకలాలు భూమిలోపలికి ఏమైనా దూసుకుపోయాయా? అన్న కోణంలోనూ వెతుకులాట చేస్తున్నామని అన్నారు. అందుకోసం చాలా లోతు వరకు తవ్వేందుకు ఎక్స్‌కవేటర్లను తీసుకెళుతున్నామని ఆయన వెల్లడించారు.
కున్మింగ్ నగరం నుంచి 123 ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో బయలుదేరిన చైనా విమానం.. గంట తర్వాత అకస్మాత్తుగా వుజా నగర సమీపంలోని కొండల్లో కుప్పకూలిపోయింది. అయితే, ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు చైనీస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, పైలట్ల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు అధికారులు తెలిపారు.