సెప్టెంబర్ 4న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఐదుగురు పౌరుల్ని అదుపులోకి తీసుకన్న చైనా సైన్యం ఎట్టకేలకు తిరిగి అప్పగించింది. శనివారం భారత భద్రతా దళాలకు ఆ ఐదుగుర్ని అప్పగించినట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. సరిహద్దు ప్రాంతంలో చైనా ఆర్మీ అప్పగించిందని, వీరు తమ స్వరాష్ట్రం చేరేందుకు మరో గంటకు పైగా సమయం పడుతుందని తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్ అప్పర్ సుబన్ సిరి జిల్లాలోని నాచో ప్రాంతంలో చైనా లిబరేషన్ ఆర్మీ ఐదుగురిని అపహరించింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నినాంగ్ ఎరింగ్ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేయటంతో భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన ఇరు దేశాల ప్రధాన విదేశాంగ కార్యదర్శుల సమావేశంలోనూ వీరిని విడిచిపెట్టాలని భారత్ డిమాండ్ చేసింది.