సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకుఇండియాతో చర్చలు అంటూనే చైనా చాప కింద నీరులా తన ”అక్రమణపర్వం’ కొనసాగిస్తోంది. టిబెట్ లో వాస్తవాధీన రేఖ వద్ద గంగానదికి ఉపనదిగా ఉన్న యార్లుంగ్ జాంగ్ బో నది పై ఈ దేశం ‘సూపర్’ డ్యామ్ నిర్మిస్తోంది. నిజానికి ఈ నది నీరు అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవహిస్తోంది..కానీ చైనా ఈ డ్యామ్ నిర్మిస్తుండడం వల్ల అరుణాచల్ కి ఇకపై ఈ నీటి సౌకర్యం ఉండబోదు. అలాగే అస్సాం లోని బ్రహ్మపుత్ర నదికి కూడా ఈ నీరు చేరదు.
అంటే ఇండియాలో రెండు రాష్ట్రాల నీటివనరులకు డ్రాగన్ కంట్రీ గండి కొడుతోంది. కొత్త శాటిలైట్ ఇమేజీల్లో ఈ డ్యామ్ స్పష్టంగా కనిపిస్తోంది. భారత-నేపాల్ సరిహద్దులకు కూడా ఈ ప్రాంతం చేరువలో ఉంది. నియంత్రణ రేఖ తూర్పు, పశ్చిమ సెక్టార్ ప్రాంతాల్లో చైనా తన మిలిటరీ సత్తాను పెంచుకుంటున్నదని, గ్రామాలకు గ్రామాలనే నిర్మిస్తున్నదని కూడా సరికొత్త శాటిలైట్ ఇమేజీలు సూచిస్తున్నాయి.
2021 మే నుంచి టిబెట్ లోని బురాంగ్ కౌంటీలో మబ్జా జాంగ్ బో అనే నదిపై కూడా ఆ దేశం డ్యామ్ నిర్మిస్తోందని డేమియన్ సైమన్ అనే రీసెర్చర్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఇమేజీలను ఆయన కూడా చూపాడు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల నది నీరు ఆగిపోతుందన్నారు. ఈ నది నీరు మొదట నేపాల్ లోని కర్నాలీ నదిలోకి, ఆ తరువాత ఇండియాలో గంగానదిలోకి ప్రవహిస్తుంది.
భారత-నేపాల్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న చైనా బోర్డర్స్ కి అతి సమీపంలో డ్యామ్ నిర్మితమవుతోందని ఆయన పేర్కొన్నాడు. ఇది 350 మీటర్ల ఎత్తు, 400 మీటర్ల పొడవు ఉందని, దీని నిర్మాణం వెనుక ఏ ఉద్దేశం ఉందో తెలియడం లేదని అన్నాడు. ఇక్కడికి దగ్గరలోనే ఎయిర్ పోర్టును కూడా చైనా నిర్మిస్తున్నదని డేమియన్ మరో బాంబు పేల్చారు. చైనా నిర్వాకం కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కూడా నీటి లభ్యత తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఆ దేశ చర్యలు ఇండియాను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, భారత నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపవచ్చునని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థకు చెందిన సీనియర్ రీసెర్చర్ సమీర్ పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు.