కరోనా పుట్టిన దేశం చైనాలో కఠిన లాక్ డౌన్ ఆంక్షలు నడుస్తున్నాయి. జీరో కొవిడ్ విధానమంటూ అక్కడి ప్రభుత్వం మరీ కఠినంగా నడుచుకుంటోంది. దాదాపు 50 రోజుల తరువాత కరోనా సోకిన వ్యక్తులను బయటకు విడిచిపెట్టింది. కొవిడ్ పాజిటివ్ సోకిన వారిని బలవంతంగా బంధించి జైళ్ల లాంటి గదులకు తరలిస్తోంది డ్రాగన్ ప్రభుత్వం. తాజాగా వారందరిని బయటకు విడిచిపెట్టడం అయితే చేశారు కానీ.. తమవారిని కలవకుండా మధ్యలో కంచెను ఏర్పాటు చేసింది. ఈ కంచెల మధ్య నుంచే కుటుంబసభ్యులు, బంధువులను చూస్తున్నారు వారంతా.
ఉత్తర కొరియాతో సరిహద్దు నగరమైన దండాంగ్ లో 50 రోజుల తరువాత కరోనా బాధితులను బాహ్య ప్రపంచంలోకి విడుదల చేసింది చైనా. పాజిటివ్ అని తేలడంతోనే వారికి కఠినమైన నిబంధనలుండే జైళ్ల లాంటి క్వారంటైన్ లో డ్రాగన్ నిర్భంధించింది. దాదాపు 50 రోజుల తరువాత వారికి తీవ్రమైన ఆంక్షలు పెట్టి బయటకు అనుమతినిచ్చింది. ఇనుప కంచెలు ఏర్పాటు చేసి వాటి మధ్యనే బంధువులు, కుటుంబ సభ్యులను కలిసేలా ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే దండాంగ్ నగరంలో ఆహారం రవాణాపై కూడా నిషేదాజ్ఞలు కొనసాగిస్తోంది. గడిచిన రెండు వారాల్లో పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల వారిని మాత్రమే బయటకు పంపిస్తోంది. కేవలం సోమవారం మాత్రమే ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అనుమతినిస్తోంది.
లాక్‌డౌన్ సడలింపు ప్రకటన వెలువడగానే చాలా మంది ప్రజలు కంచెల వద్దకు వచ్చి తమ వారి కోసం ఎదురు చూశారు. ప్రజలను తప్పని సరి పరిస్థితుల్లోనే ఇబ్బందులకు గురి చేయాల్సి వస్తోందని దండాంగ్ మేయర్ అన్నారు. అంతేకాకుండా అరకొర వసతుల మధ్య క్వారంటైన్ లో ఉంచినందుకు కరోనా పేషెంట్లకు క్షమాపణలు చెప్పారు.