జీరో కొవిడ్ విధానాన్ని ఆకస్మాత్తుగా ఎత్తివేసి చైనా తప్పు చేసిందా ? ఆ తప్పు వల్లే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ భారీ మూల్యం చెల్లించుకుంటోందా? దేశంలో మిలియన్ల కొద్ది ప్రజల మరణాలకు జిన్ పింగ్ ప్రభుత్వ వైఫల్యమే కారణమా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
చైనాలో జీరో కొవిడ్ విధానంపై పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో జీరో కొవిడ్ విధానంలో డ్రాగన్ ప్రభుత్వం వెనకడుగు వేసింది. జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తి వేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఎలాంటి ముందుస్తు ప్రణాళికలు లేకుండా జీరో కొవిడ్ విధానానికి స్వస్తి పలికి డ్రాగన్ ప్రభుత్వం తప్పు చేసిందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధానాన్ని హఠాత్తుగా ఎత్తి వేయడంతో దేశంలో లక్షలాది మరణాలు నమోదయ్యాయని అంటున్నారు. జీరో కొవిడ్ విధానంపై డ్రాగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో గతేడాది డిసెంబర్‌లో ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
కానీ దీన్ని హఠాత్తుగా ఎత్తివేయకుండా మొదట వ్యాక్సినేషన్ పూర్తి చేసి వుండాలని, యాంటీ వైరల్ ఔషధాల స్టాక్ పెట్టుకుని ఉన్నట్టయితే 2 నుంచి మూడు లక్షల మరణాలను చైనా నివారించగలిగేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీరో కొవిడ్ విధానం ఎత్తివేసిన తర్వాత కేవలం ఆరు వారాల్లోనే 80శాతం మందికి కొవిడ్ వ్యాపించినట్టు చైనా వ్యాధుల నియంత్రణ సంస్థ అంచనా వేసింది. దీంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ చైనా మాత్రం 90 వేల మంది మాత్రమే మరణించినట్లు చెబుతోంది.
ఈ విధానాన్ని ఎత్తివేసే సమయానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను చైనా పూర్తి చేయలేదని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు టీకాలు అందించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో సరిపడా వైద్య సిబ్బంది, వైద్య సామగ్రి, సరైన వసతులు కూడా లేవని ఆరోపించారు.
ఓ వైపు సరైన ప్రణాళిక లేకపోవడం, మరో వైపు ప్రభుత్వ వైఫల్యం కలగలిపి వైరస్ విజృంభణకు సహకరించాయన్నారు. శీతాకాలంలో వైరస్ చాలా తేలిగ్గా, వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో అకస్మాత్తుగా జీరో కొవిడ్ విధానానికి ముగింపు పలకడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందన్నారు.
ప్రపంచ దేశాలన్నీ కొవిడ్‌తో సహజీవనం చేస్తున్నాయి. కానీ చైనా సర్కార్ మాత్రం జీరో కొవిడ్ విధానాన్ని పాటించింది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నా, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నా నిబంధనలను సడలించేందుక మాత్రం డ్రాగన్ ప్రభుత్వం ససేమేరా అంది.
కానీ ఆ తర్వాత ప్రభుత్వ తీరుపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎక్కడికి వెళ్లాలన్నా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనను వ్యతిరేకించారు. ఈ మేరకు భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఏకంగా జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదవి నుంచి జిన్‌పింగ్ దిగిపోవాలని, కమ్యూనిస్టు పార్టీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో జిన్‌పింగ్ సర్కారు దిగి వచ్చి చైనాలో కొవిడ్ ఆంక్షలను సడలించింది.