కరోనా కొత్త వేరియంట్లతో దేశం పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నదని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు. ఈ సవాళ్ల కారణంగా మన దేశం ‘కొత్త దశ’ లో ప్రవేశించి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నదన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం దేశ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘కోవిడ్ రెస్పాన్స్ టఫ్ ఛాలెంజ్ ని విసురుతోంది.. దీన్ని అదుపు చేయడానికి అసాధారణమైన ప్రయత్నాలను చేబట్టవలసి వస్తోంది ‘అని చెప్పారు.
2022 లో 20 వ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించగలిగామని, అన్ని రంగాల్లో నవ చైనా ఆవిర్భావానికి బ్లూ ప్రింట్ ని రూపొందించగలిగామని, కొత్త ప్రయాణానికి మార్గాలను ఏర్పరచుకోగలిగామని అన్నారు. దేశ ఎకానమీ గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలను రూపొందించుకున్న దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉందన్నారు.
చైనా ఎకానమీ భేషుగ్గా ఉంది.. మొత్తం సంవత్సరానికి మన దేశ జీడీపీ 120 ట్రిలియన్ యువాన్లను మించిపోగలదని ఆశిస్తున్నాం.. ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం నెలకొన్నప్పటికీ.. వరుసగా 19 వ సారి కూడా చైనా బంపర్ పంటలను పండించగలిగింది.. ప్రజలకు పటిష్టమైన ఫుడ్ సప్లయ్ ని సమకూర్చగలిగింది అని జీ జిన్ పింగ్ వివరించారు.
పేదరికాన్ని నిర్మూలించగలిగామని, గ్రామీణ చైతన్యాన్ని పెంచగలిగామని, ప్రజల కష్టాలను తీర్చేందుకు పన్ను రాయితీలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. నవంబరులో మృతి చెందిన తమ దేశ నేత జియాంగ్ జెమిన్ కి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఇంత సుదీర్ఘంగా ప్రసంగం చేసిన జిన్ పింగ్ తమ దేశంలో కరోనాకారణంగా వేలమంది మృతి చెందుతున్నా.. లక్షల మంది ఈ మహమ్మారికి గురవుతున్నా.. దీని అదుపునకు గానీ, కొత్త వ్యాక్సిన్ డెవలప్మెంట్ కి సంబంధించి గానీ పల్లెత్తు మాట ప్రస్తావించలేదని అంటున్నారు.