కరోనా వైరస్ పుట్టిన చైనాలో చికెన్ లోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయంటూ ఆ దేశం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త గుబులు రేపుతున్నాయి. ఇన్నాళ్లు బలమైన ఆహారం కోసం చికెన్ తినాలి అంటూ అంతా ప్రచారం చేస్తున్న దశలో తమ దేశంలో చికెన్ లోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు కనపడుతున్నాయని చైనా బాంబ్ పేల్చింది.
బ్రెజిల్ నుండి వచ్చిన ఫ్రిజెన్ చికెన్ లో కరోనా వైరస్ కనుగొన్నట్లు చైనా వెల్లడించింది. మాములుగా జరిపే చెకింగ్ లో భాగంగానే మాంసం చెక్ చేస్తున్న సమయంలో కనుగొన్నామని, కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరగటంలో ఇదీ ఓ కారణం కావచ్చు అంటూ చైనా వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచారం అయ్యాయి.
ఈ వారం ఈక్వెడార్ నుంచి వచ్చిన ఎండ్రకాయలు, చేపలకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. జూన్ నెలలో బ్రెజిల్ సహా మరికొన్ని దేశాల నుంచి మాంసం దిగుమతులను చైనా నిలిపివేసింది. చికెన్‌లో కరోనా ఆనవాళ్లు కనిపించడంపై చైనా.. బ్రెజిల్‌ను వివరణ కోరగా, దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన సమయంలో చికెన్ నుండి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ప్రచారం జరగటంతో చికెన్ ముట్టేందుకు జనం ముందుకు రాలేదు. దీంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీంతో ఏకంగా మంత్రులే చికెన్ తింటూ చికెన్ వల్ల ఏమీ కాదని ప్రచారం చేశారు. ఆ తర్వాత చికెన్ ధరలు మటన్ తో పోటీ పడగా… ఇప్పుడు కరోనా వైరస్ పుట్టిన చైనా దేశమే చికెన్ లో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.
నిజానికి కరోనా వైరస్ వ్యాప్తి కూడా చైనా వుహాన్ లోని మాంసం విక్రయ మార్కెట్ నుండి అన్న ప్రచారం కూడా ఉంది. అక్కడ గబ్బిలాలు, కుక్కలు, పాముల మాసం కూడా అమ్ముతారు. అక్కడి నుండి వైరస్ మొదలైందని చాలా దేశాలు, వివిధ పరిశోధనలు వెల్లడించాయి. ఇప్పుడు సీ ఫుడ్, చికెన్ లో కూడా కరోనా ఉందన్న ప్రచారంతో జనం వీటిని ఎంతవరకు ఇష్టపడతారు అన్నది సందేహంగా మారింది.