ఈ-పేమెంట్స్ సర్వీస్ సంస్థ పేటీఎంలో వాటాను విక్రయించబోమని చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్ స్పష్టం చేసింది. ఏటీఎంలో తమకున్న 30 శాతం వాటాను అమ్మివేస్తున్నట్లు వస్తున్న కథనాలను ట్విట్టర్ ద్వారా ఖండించింది. చైనాలో ఈ కామర్స్ దిగ్గజ కంపెనీగా ఉన్న యాంట్ గ్రూప్ కూడా అలీబాబా గ్రూప్ కు చెందినదే కావటం విశేషం.
చైనా కంపెనీలపై భారత్ లో ఉన్న అనిశ్చితి నేపథ్యంలో… పేటీఎం మాతృ సంస్థ అయిన ఒన్97 కమ్యూనికేషన్స్‌లో గల వాటాను యాంట్ గ్రూప్ విక్రయించనున్నట్లు బుధవారం కథనాలు వచ్చాయి. దీన్ని పేటీఎం కూడా ఖండిస్తూ… అలాంటి చర్చలే జరగటం లేదని, భవిష్యత్ ఆలోచనలు కూడా లేవని ప్రకటించింది.
పేటీఎం దేశీయంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఫోన్‌పే, గూగుల్ పే, అమజాన్ పే తో పాటు వాట్సప్ కూడా వాట్సప్ పే వంటి యాప్స్ తీసుకొచ్చింది. దీంతో పోటీని తట్టుకునేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను పొందడం ద్వారా బ్యాంకులు, కార్డులను జారీ చేసే పేమెంట్ గేట్‌వేలతోనూ పోటీ పడేందుకు రెడీ అయ్యింది. పేటీఎంలో చైనాకు చెందిన యాంట్ గ్రూప్ వాటా 5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనాలున్నాయి.