హాంకాంగ్ పై తాము పట్టు సాధించామని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రకటించారు. దీన్ని అరాచక శక్తుల నుంచి సుపరిపాలన కిందికి తెచ్చామన్నారు. ఆదివారం బీజింగ్ లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ మహాసభను ఆయన ప్రారంభించారు. తైవాన్ వేర్పాటువాదంపై తాము పెద్ద పోరాటాన్నే ప్రారంభించామని, ఆ ప్రాంత ప్రాదేశిక సమగ్రతను ఎదుర్కోగల సత్తాను సంతరించుకున్నామని అన్నారు. బీజింగ్ లో ఈ పార్టీ 20 వ మహా సభలు 5 రోజులపాటు జరగనున్నాయి.
ఈ సభల కాలంలోనే ప్రధాని లీ కెజియాంగ్ సహా ఉన్నతస్థాయి అధికారులనందరినీ జిన్ పింగ్ మార్చనున్నారు. అంటే పెద్దఎత్తున పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పూనుకోనుంది. ఆదివారం ప్రారంభమైన సభలు ఈ నెల 22 వరకు జరగనున్నాయి. చైనా-తైవాన్ పోరులో విదేశీ శక్తుల జోక్యాన్ని జిన్ పింగ్ ఖండించారు. చైనా పునరుజ్జీవనానికి పార్టీ కృషి చేస్తూనే ఉంటుందన్నారు. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వహిస్తున్న పాత్రను ప్రశంసించారు. హాంకాంగ్ లో జరిగిన ప్రజాస్వామ్య నిరసనల పట్ల అసంతృప్తి ప్రకటించిన ఆయన.. ఇప్పటికైనా అక్కడి పరిస్థితి అరాచక శక్తుల బారి నుంచి గవర్నెన్స్ దిశగా పెను మార్పు పొందిందన్నారు. .
చైనాలో కోవిడ్ అదుపునకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను జిన్ పింగ్ సమర్థించారు. తమ పాలసీలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. వీటిని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఈ మహాసభల సందర్భంగా జిన్ పింగ్ ఎన్నుకున్న సుమారు 2,300 మంది డెలిగేట్లు.. ఆయనను తిరిగి పార్టీ అగ్రనేతగా ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇది తిరిగి మూడోసారి ఆయన చైనా అధ్యక్షునిగా మార్గం సుగమం కావడానికి దోహదపడుతుంది. మావో జెడాంగ్ తరువాత అత్యంత పవర్ ఫుల్ లీడర్ గా జిన్ పింగ్ పాపులర్ అవుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చైనాలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్, టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వంటి బడా సంస్థలు నష్ఠాలను ఎదుర్కోవడంతో ఈ దేశ ఎకానమీ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా నష్ట పోయింది. ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తూ వస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో తమ వృద్ధి రేటు 5.5 శాతం ఉండగలదని చైనా ఆర్థిక నిపుణులు అంచనా వేసినప్పటికీ, ఇది చాలా తక్కువగా.. 3.4 శాతం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తమ దేశ ఎకానమీని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని జిన్ పింగ్ ప్రకటించారు. మార్కెట్ కేపిటలైజేషన్ లో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్.. లోగడ 344 బిలియన్ డాలర్ల మేర నష్టపోయిన విషయాన్ని బ్లూమ్ బెర్గ్ ఆ మధ్య ప్రకటించింది. ఈ సంస్థ షేర్లు రికార్డు స్థాయికి పడిపోయాయి.