చైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలోఇటీవల కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో దేశంలో వైద్య ఆస్పత్రులకు జిన్ పింగ్ సర్కార్ కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపాలని వైద్య శాఖను ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.
దీని కోసం మరణ ధ్రువీకరణ పత్రాల్లో మరణానికి కారణం కరోనా అని రాయడం తగ్గించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ మేరకు తమకు ఆదేశాలు జారీ అయినట్టు వైద్యులు కొందరు చెబుతున్నారు. మరణాలకు కారణాలను నిర్దారించే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు అంటున్నారు.
ఆస్పత్రిలో చేరిన పేషంట్లకు కరోనాతో పాటు మరో జబ్బు ఉంటే మరణానికి రెండో జబ్బే కారణంగా రాయాలని జిన్ సర్కార్ ఆదేశించినట్టు పేర్కొంటున్నారు. కేవలం కరోనా ఒక జబ్బు ఉన్న వారికి మాత్రమే కరోనా డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని మిగతా మరణాలకు అలా ఇవ్వద్దని సూచించారని వెల్లడించారు.
కరోనా కారణంగానే మరణించారని భావిస్తున్న సమయంలోనూ వెంటనే సర్టిఫికెట్ ఇవ్వవద్దని ఆస్పత్రుల నిర్వాహకులకు, వైద్యులకు సూచిస్తున్నట్టు వివరించారు. అలాంటి సందర్భంలో విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని మరోసారి నిపుణులు పరీక్షించిన తర్వాత మాత్రమే డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశాలు అందాయంటున్నారు.
మొదటి ఫేజ్ నుంచి కరోనా మరణాలపై ఇప్పటి వరకు చైనా నోరు మెదపలేదు. కానీ కిందటి నెలలో మాత్రం 60 వేల మంది చనిపోయినట్టుగా ప్రకటించింది. గత డిసెంబర్ 8 నుంచి జనవరి మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఇందులో 54,435 మంది కరోనాతో పాటు ఇతర వ్యాధుల కారణంగా మరణించారు. 5,503 మంది కరోనాతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడి మృతి చెందారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది