చైనాలో కోవిడ్ కరాళనృత్యం చేస్తోంది. లక్షల్లో కోవిడ్ బాధితులు ఆసుపత్రి పాలవుతున్నారు. మరణాలు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో చైనా పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇక ఆ దేశ రాజధాని బీజింగ్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అన్ని ఆసుపత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ లోని అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోయాయి.
రోగులు హాల్లోనే స్ట్రెచర్లపై పడుకుంటున్నారు. వీల్ చైర్ లోనే ఆక్సిజన్ తీసుకుంటున్నారు కొందరు రోగులు. రోగుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ పడకలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చికిత్స తీసుకుంటున్న వారిలో వృద్ధులే అధికంగా ఉన్నారు. మరో వైపు రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పై ఒత్తిడి పెరుగుతుంది.
ఇక శ్మశాన వాటికలు కూడా కోవిడ్ రోగుల శవాలతో నిండిపోతున్నాయి. ఓమిక్రాన్ బీఏ 5.2, బీఎఫ్7 వేరియంట్లు చైనాను అల్లకల్లోలం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే ఈ రెండు వేరియంట్ల వల్ల దేశంలో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగింది.
మరో వైపు మందుల కొరత కూడా చైనాను వేధిస్తోంది. అక్కడ ప్రజలు బ్లాక్ మార్కెట్లో మందులను కొనుగోలు చేస్తున్నారు. జ్వరం జలుబు మందులకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది.