సమతామూర్తి విగ్రహావిష్కరణ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. శిలాఫలకంపై పేరు లేకుండా చేసి అవమానించారని.. అందుకే కేసీఆర్ వెళ్లలేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించారు చినజీయర్ స్వామి. సమతామూర్తి కేంద్రంలోని 108 ఆలయాల్లో శనివారం కల్యాణ మహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను చెప్పేందుకు మీడియా సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు చినజీయర్. సమతామూర్తి కేంద్రానికి వచ్చినప్పుడు ఆయనే మొదటి వాలంటీర్ నని చెప్పినట్టు గుర్తు చేశారు. ఆరోగ్యం, ఇతర కార్యక్రమాల వల్లే ఉత్సవాలకు సీఎం రాలేకపోయి ఉంటారని తెలిపారు. సమతామూర్తి వేడుకలకు సీఎం పూర్తి సహకారం ఉందన్నారు. కల్యాణానికి ఆహ్వానించామని చెప్పారు. స్వపక్షాలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు ఇలా తమకు ఎవరితోనూ ఎలాంటి భేదాలు ఉండవని స్పష్టం చేశారు.
కేసీఆర్ తో విభేదాలని అనడమే సరికాదన్న చినజీయర్.. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ముస్లిం లీడర్లను కూడా ఆహ్వానించామని గుర్తు చేశారు. ఆహ్వాన పత్రికలను అరబిక్ భాషలో కూడా ముద్రించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు.
రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు చినజీయర్. వీలయితే ఆదివారం నుంచి రామానుజ సువర్ణ మూర్తి దర్శనానికి కార్యనిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక శనివారం శాంతి కళ్యాణం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 8 గంటల నిర్వహిస్తామని వివరించారు.