ఓవైపు తమ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గకున్నా.. చైనా తన సరిహద్దులను తిరిగి తెరచింది. కోవిడ్ సంబంధిత అనేక ఆంక్షలను ఎత్తివేసింది. ఆదివారం నుంచే అవి అమలులోకి వస్తాయని, అంతర్జాతీయ ప్రయాణికులకు బోర్డర్స్ ని పునరుద్ధరించాలని నిర్ణయించామని ఈ దేశ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రకటించినట్టు ది గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. దాదాపు మూడేళ్లకు పైగా చైనా తన సరిహద్దులను మూసి ఉంచింది. అయితే జనవరి 8 నుంచి తిరిగి తెరుస్తామని ఇదివరకే ప్రకటించింది.
విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేయాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం రద్దు చేసినట్టు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. వీరు తప్పనిసరిగా మూడు వారాలపాటు క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాలని ఇదివరలో ఆదేశించిన అధికారులు.. ఇకపై ఈ అవసరం లేదని స్పష్టం చేశారు.
నిజానికి ప్రభుత్వం తన జీరో కోవిడ్ పాలసీని మధ్యలోనే విరమించుకోవడంతో దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతుండగా.. కోవిడ్ టెస్టింగ్ కేంద్రాల వద్ద టెస్టుల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. మందుల కొరత ఈ దేశాన్ని తీవ్రంగా పీడిస్తోంది. చైనా నుంచి వస్తున్న ప్రయాణికులపై అనేక దేశాలు ప్రయాణ సంబంధ ఆంక్షలను కొనసాగిస్తున్నాయి.
డ్రాగన్ దేశం నుంచి వస్తున్నవారు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టులు సమర్పించాలని నెదర్లాండ్స్, పోర్చుగల్ తదితర దేశాలు ఆదేశిస్తున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో ఉండగా.. దేశీయంగా ప్రయోగాత్మకంగా తమ ఎం ఆర్ ఎన్ ఏ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సిఎస్-2034 అనే ఈ వ్యాక్సిన్ ని ఇక తయారు చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. స్కూలు విద్యార్థులు తప్పనిసరిగా నెగెటివ్ కోవిడ్ రిపోర్టును సమర్పించాలన్న రూల్ ని కూడా ఈ దేశంలో ఎత్తేశారు.