కరోనా కారణంగా ఒలంపిక్ నుండి చైనా తప్పుకోబోతుందా…? చైనా క్రీడాకారులను దూరంగా ఉంచితేనే ఒలంపిక్స్‌లో ఇతర దేశాలు పాల్గొనబోతున్నాయా…? చైనా అథ్లెట్స్‌ను ప్రపంచ దేశాలు దూరం పెట్టడం ఇందులో భాగమేనా…?
కొంతకాలంగా చైనా అథ్లెట్స్ ఉన్న ఏ ఈవెంట్‌కు ప్రపంచ దేశాలు అంగీకరించటం లేదు. ఢిల్లీలో జరిగే ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు సైతం చైనా రెజ్లర్లకు ఇండియా వీసా మంజూరు చేయలేదు. ఇప్పటికే చైనాలో జరగాల్సిన మహిళా ఒలంపిక్ ఫుట్‌బాల్ అర్హత పోటీలు, ప్రపంచ అథ్లెటిక్ ఇండోర్ ఛాంపియన్‌షిప్, ఎఫ్1 గ్రాండ్‌ప్రిక్స్ వంటి ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. ప్రపంచ దేశాలు చైనా దేశస్తుల్ని తమ దేశానికి రానివ్వాలంటేనే జంకుతున్నారు. దీంతో టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్ గేమ్స్‌పై అనిశ్చితి నెలకొంది.
జులై 24 నుండి ఒలంపిక్స్ గేమ్స్ మొదలు కావాల్సి ఉంది. గేమ్స్ మొదలయ్యేందుకు ఇంకాస్త సమయమున్నా… ఆ ఈవెంట్‌లో దాదాపు 11వేలకు పైగానే అథ్లెట్లు పాల్గొంటారు. దీంతో చైనా దేశస్తుల్ని ఈ ఈవెంట్‌కు హజరయ్యేందుకు పలు దేశాలు నిరాకరిస్తున్న సందర్భంలో ఒలంపిక్ సంఘం ఏం చేస్తుందని ఆసక్తికరంగా మారింది. జపాన్‌లోని యెకోహమా తీరంలో నిలిపి ఉంచిన నౌకలో దాదాపు 500మందికి కరోనా వైరస్ సోకిందని గుర్తించారు.
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ విషయంలో ఇప్పుడే ఎటువంటి ప్రకటన చేయటం సరైంది కాదని అభిప్రాయడగా… ఒలంపిక్స్ నిర్వహణపై ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని యూఎన్ ఏజెన్సీ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ అధికారి ప్రకటించారు. కరోనా వైరస్ గుర్తించిన నాటి నుండి ఒలంపిక్ సంఘంతో కంటిన్యూగా సంప్రదింపులు జరుపుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.