చైనాలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 908 కి చేరినట్టు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారిలో ఎక్కువ శాతం వ్యుహాన్ దాని పరిసరాల్లో హుబెయ్ ఫ్రావిన్స్ కు చెందిన వారే. ఈ ప్రాణాంతక వైరస్ కు ఆదివారం ఒక్కరోజే 97 మంది ప్రాణాలు కోల్పోయారని… ఇప్పటి వరకు 40,171 మందిలో వైరస్ నిర్ధారించినట్టు చైనా నేషనల్ హెల్త్ మిషన్ తెలియజేసింది.
కరోనా వైరస్ కారణంగా పొడిగించిన ల్యూనార్ న్యూ ఇయర్ సెలవులు ముగియడంతో ప్రజలు ఒక్కొక్కరుగా తమ విధులకు హాజరవుతున్నారు. చాలా మంది ఇంటి దగ్గరి నుంచే పని చేస్తున్నారు. అయితే ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొన లేదు. వైరస్ మృతులు ఎక్కువ మెయిన్ లాండ్ చైనాకే పరిమితం కావడంతో మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు కొంత మెరుగ్గానే ఉన్నాయి. అయితే ప్రజలను వైరస్ భయం వెంటాడుతుంది. ముందు జాగ్రత్త చర్యలతో తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. వైరస్ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు గత ఎనిమిదేళ్లలో ఎన్నడు లేనంతగా ఆకాశాన్నంటాయి. దీంతో రిటైల్ ఇన్ ప్లేషన్ 5.4 కు చేరింది. ఆహార పదార్ధాల ధరలు 20.6 శాతానికి పెరిగాయి. కరోనా వైరస్ తో ఆ దేశ వాణిజ్యానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ట్రావెల్, సప్లై వ్యాపారాలు హాంగ్ కాంగ్ ఎకానమీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో ఉండే విదేశీయులను ఆయా దేశాలు తీసుకొని వెళ్లాయి. వైరస్ భయంతో కొన్ని దేశాలు చైనాకు విమానాలను రద్దు చేశాయి. చైనా బయట హాంగ్ కాంగ్ లో ఒకరు, ఫిలిప్పీన్స్ లో ఒకరు చొప్పున చనిపోయారు. జపాన్ లో డైమాండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ ప్రయాణీకుల్లో 60 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారించారు. వైరస్ అన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం చైనాలో వైరస్ కట్టడికి ప్రయత్నాలు కొనసాగిస్తోంది.