కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అన్ని దేశాల్లోనూ కోవిడ్ ఆంక్షలు ఎత్తివేశారు. కానీ, కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో మాత్రం కఠిన ఆంక్షలతో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. రోజురోజుకు నమోదవుతున్న కొత్త కేసులతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దీంతో వైరస్ను ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద మిగిలిన ప్రపంచానికి భిన్నమైన రీతిలో అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగానే సొసైటల్ జీరో పేరుతో.. జీరో కొవిడ్ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో చైనా ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో కఠిన ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఆహారం, మందులు కొనుగోలుకు, ఆస్పత్రులకు వెళ్లేందుకు అనుమతిస్తుంది. అయితే, రాబోయే రోజుల్లో వాటికీ అనుమతి ఇచ్చే అవకాశం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా షాంఘై నగరంలోని పలు ప్రాంతాల్లో ఆహార సరఫరా సేవలనూ నిలిపేయాలని నిర్ణయించింది చైనా ప్రభుత్వం.
దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలను ఆహారం కొనేందుకు.. ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా వీధుల్లోకి వచ్చేందుకు అనుమతులు నిరాకరిస్తున్నారు అధికారులు. వైద్యశాలల్లో కూడా ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇరుగుపొరుగున ఉన్న వారిని సైతం ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కరోనా ఆంక్షలు విధించి దాదాపు ఏడు వారాలు అవుతోంది.
అధికారులు ఎంతలా ప్రయత్నిస్తున్నా.. కరోనా కేసుల్ని తగ్గుముఖం పట్టేలా చేయగలుగుతున్న తమ లక్ష్యంగా ఉన్న ‘సొసైటల్ జీరో’ను అందుకోలేకపోతున్నారు. క్వారంటైన్లో ఉన్న వారిలో తప్ప బయట ఎక్కడా కొత్త కొవిడ్ కేసు రాకూడదనేది ‘సొసైటల్ జీరో’ లక్ష్యం. మరోవైపు, షాంఘైలో సైలెంట్ పీరియడ్ పేరుతో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
దీనిలో కేవలం ప్రభుత్వ ఆహార సరఫరాలను మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ కేసులు కాకుండా ఎవరైనా ఆస్పత్రులకు వెళ్లాలంటే కమిటీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అంతే కాకుండా కొవిడ్ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని బలవంతంగా సెంట్రల్ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఇళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి ఇంటి తాళాలను తలుపుల వద్ద ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నిర్ణయాలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.