చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వుహాన్ లో కరోనా వైరస్ నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలను సోమవారం పరిశీలించారు. దేశ రాజధాని బీజింగ్ లో ని కరోనా వైరస్ సెంటర్ కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను గుర్తించిన తర్వాత దేశాధ్యక్షుడు చాలా రోజులకు ప్రజలకు కనిపించారు. ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్ ధరించిన జిన్ పింగ్ నగరంలోని చావోయాంగ్ జిల్లాలో నిర్మించిన కరోనా వైరస్ సెంటర్ ను సందర్శించినట్టు చైనా అధికారిక మీడియా టెలివిజన్ సీసీటీవీ తెలిపింది.
ల్యూనార్ న్యూ ఇయర్ సెలవులు ముగియడంతో ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన లక్షలాది ప్రజలు తిరిగి పనుల్లోకి చేరుకుంటుండంతో దేశ రాజధాని బీజింగ్ లో తిరిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధ్యక్షుడు జిన్ పింగ్ ఏ చిన్న కార్యక్రమంలో పాల్గొన్నా ప్రధానంగా చూపించే సీసీటీవీలో ఇటీవల కనిపించడం లేదు. అధ్యక్షుడు అన్ని పనులను తెరవెనుక ఉండి సమీక్షిస్తుండడం వల్లనే కనిపించడం లేదన్నట్టుగా అధికారిక మీడియా కవరింగ్ ఇస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.