ఉక్రెయిన్ పట్ల రష్యా ఎలాంటి విధానం పాటిస్తోందో చైనా కూడా ఇండియా పట్ల అలాగే వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ పట్ల డ్రాగన్ కంట్రీ ..రష్యా మాదిరి అదే పంథాను అనుసరిస్తోందన్నారు. మన దేశ సరిహద్దులను చైనా మార్చేయాలని చూస్తోందని, ఇరు దేశాల బోర్డర్లో అనిశ్చిత స్థితి, ఉద్రిక్తతలు… బలహీనమైన ఎకానమీతోను, ద్వేషం, దూరదృష్టి లేమివంటి వాటితోను ముడి పడి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
‘భారత భూభాగంలో చైనా తిష్ట వేసుకుని కూచుంది’ అని అభివర్ణించారు. పశ్చిమ దేశాలతో మీరు గట్టి సంబంధాలు పెట్టుకోరాదని ఉక్రెయిన్ ని రష్యా కోరుతోంది.. అలా చేస్తే మీ భౌగోళిక సరిహద్దులను మార్చేస్తాం అని హెచ్చర్తిస్తోంది .. ఇప్పుడు చైనా సైతం .. అదేవిధంగా మీ భౌగోళిక బోర్డర్లను మార్చుకోవాలని, మేం లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రవేశించి వాటిని హస్తగతం చేసుకుంటాం అన్న ధోరణిలో ఇండియాను ఒక విధంగా హెచ్చరిస్తోంది అని రాహుల్ పేర్కొన్నారు. సినీ నటుడు, పొలిటికల్ లీడర్ కమల్ హాసన్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సంభాషణ తాలూకు వీడియోను ఆయన యూట్యూబ్ లో షేర్ చేశారు. సరిహద్దుల్లో పోరు అని లోగడ వ్యవహరించేవారమని, కానీ ఇప్పుడది .. .ప్రతిచోటా పోరాటం అన్నట్టు మారిపోయిందని రాహుల్ చెప్పారు. 21 వ శతాబ్దంలో దేశంలో సామరస్యం అన్నది వెల్లివిరియాలని, ప్రజలు ఒకరితో ఒకరు కలహించుకోరాదని, శాంతి, సుస్థిరత అన్నవి ప్రధానమని అన్నారు. కానీ అంతర్గత సమస్యలతో, అయోమయంతో మనం కొట్టుమిట్టాడుతున్న విషయం చైనాకు తెలుసునని, అందువల్లే బరితెగించడానికి సిద్ధపడిందని రాహుల్ చెప్పారు.
భారతీయులు తమలో తాము పోరాడుతుంటే.. నిరుద్యోగం, ఎకానమీ క్షీణత వంటివి పెరుగుతుంటే ఈ పరిస్థితిని విదేశీ ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి యత్నిస్తారని ఆయన అన్నారు. చైనా వంటి సమస్యలపై విపక్షాలను ప్రభుత్వం విశ్వాసం లోకి తీసుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. మేం సలహాలు, సూచనలు, ఐడియాలు ఇవ్వవచ్చు.. కానీ ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేదు అన్నారాయన.