చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కరోనా విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే షాంఘైలో చైనా లాక్ డౌన్ విధించింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
దీంతో తాజాగా నగరంలో సైన్యాన్ని స్థానిక ప్రభుత్వం రంగంలోకి దించింది. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డైలీ కథనాలను ఊటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ అనే మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆర్మీ, నేవీ ఇతర దళాలకు అనుబంధంగా ఉన్న ఏడు మెడికల్ యూనిట్ల నుంచి మెడికల్ సిబ్బందిని షాంఘైకు పంపినట్టు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. షాంఘైకి చేరుకున్న వెంటనే వైద్య చికిత్సలు మొదలు పెట్టి న్యూక్లీయిక్ పరీక్షలను మెడికల్ సిబ్బంది నిర్వహిస్తున్నారని పేర్కొంది.
వీరందరిని వై 20 ఏయిర్ క్రాఫ్ట్ ద్వారా షాంఘైకి వీరిని చైనీస్ ఎయిర్ ఫోర్స్ తరలించినట్టు చెప్పింది. సోమవారం నగరం మొత్తం న్యూక్లియిక్ టెస్టులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీంతో పాటు తూర్పు చైనాలోని జియాంగ్జూ, ఝెజియాంగ్, అన్హుయ్, జియాంగ్షీ సహా మరికొన్ని రాష్ట్రాల నుంచి షాంఘైకి వైద్య సిబ్బందిని ప్రభుత్వం పంపింది. తాజాగా గడిచిన 24 గంటల్లో చైనాలో 1366 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.