అమెరికా-చైనా మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. తమ స్పై బెలూన్ ని అమెరికా కూల్చివేయడం పట్ల చైనా మండిపడింది. ఇందుకు మా స్పందన ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తామని అమెరికాను హెచ్చరించింది. మీరు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారని, ప్రాక్టీసుకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను అతిక్రమిస్తున్నారని ఆరోపించింది. మీ చర్య పట్ల తీవ్ర అసంతృప్తిని, నిరసనను ప్రకటిస్తున్నాం.. అది అసలు మానవ రహిత సివిలియన్ ఎయిర్ షిప్.. వాతావరణ పరిశోధనలకోసం దాన్ని వినియోగించినప్పుడు దిశ మార్చుకుని అది అమెరికా వైపు వచ్చింది అని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇందుకు మా ప్రతిస్పందనను తెలియజేసే హక్కు మాకుంది అని వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ రక్షణ రహస్యాలను పసిగట్టేందుకు చైనా ప్రయోగించిన గూఢచర్య బెలూన్ గా అనుమానించిన అమెరికా నిన్న తమ దేశ గగనతల పరిధిలోని ఈ బెలూన్ ని యుద్ధ విమానాల సాయంతో అట్లాంటిక్ సముద్ర తలాల వైపునకు తీసుకువచ్చి పేల్చివేసింది.
దక్షిణ కాలిఫోర్నియా మర్దల్ బీచ్ ప్రాంతంలో ఈ బెలూన్ శకలాలు పడ్డాయి. వీటిని సేకరించేందుకు అమెరికా సైనిక సిబ్బంది ప్రయత్నాలు చేశారు. మా కీలకమైన రక్షణ స్థావరాల సమాచారాన్ని తెలుసుకునేందుకే చైనా ఈ బెలూన్ ని ప్రయోగించిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, రక్షణ శాఖ మంత్రి ల్యాడ్ ఆస్టిన్ అంతకుముందు ఆరోపించారు.
దీన్ని పేల్చివేయడానికి ముందు చార్ల్స్ టన్, మర్దల్ బీచ్, సౌత్ కెరొలినా, విల్మింగ్ టన్ ఎయిర్ పోర్టులతో సహా కెరొలినా కోస్ట్ లైన్ ని తాత్కాలికంగా మూసివేశారు. బెలూన్ ని పేల్చివేసిన తరువాత చిన్న పేలుడుతో అది సముద్ర జలాల్లో పడిపోతున్న దృశ్యాల తాలూకు వీడియోలు వైరల్ అయ్యాయి.