చైనాలో జనాభా తగ్గుతోంది. గత ఆరు దశాబ్దాల్లో చైనాలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సుమారు 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ప్రస్తుతం జనన రేటు చాలా వరకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన డేటాను అధికారులు విడుదల చేశారు.
2020 చివరి నాటికి చైనా జనాభా 141750000గా ఉందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక పేర్కొంది. ఇది 2019తో పోలిస్తే జనాభా 8,50,000 తగ్గినట్లు వెల్లడించింది. గత ఏడాది సుమారు 95 లక్షల మంది జన్మించగా, కోటీ 4 లక్షల మంది మరణించినట్టు తెలిపింది.
చైనాలో జననాల సంఖ్య 9.56 మిలియన్లు, మరణాల సంఖ్య 10.41 మిలియన్లు చెప్పింది. ఇక చైనాలో 1960లో జనాభా తగ్గింది. అప్పట్లో మావో అనుసరించిన వ్యవసాయ విధానాలు ఆ దేశంపై తీవ్రప్రభావాన్ని చూపించాయి. దీంతో చైనాలో ఆ రోజుల్లో తీవ్ర కరువు వచ్చింది.
ఆ తర్వాత జనాభా అత్యధికంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో 1980 దశకంలో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టారు. అధిక జనాభా పెరిగితే దేశం పలు ఇబ్బందులు ఎదుర్కొంటుందనే ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.