లడఖ్ నుండి సిక్కిం వరకు విస్తరించి ఉన్న భారత్, చైనా సరిహద్దు వెంబడి అనేక కీలక ప్రదేశాల్లో చైనా అక్రమ నిర్మాణాలను చేపడుతోంది. వారి వాహనాలు, ఇతర అవసరాల కోసం మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ ను విస్తరిస్తున్నట్లు తాజాగా వెలువడ్డ ఉపగ్రహ చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పాంగాంగ్ సరస్సు వద్ద పెద్ద ఎత్తున వంతెన నిర్మాణం చేపట్టడం కూడా ఈ శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తోంది.
సరిహద్దు వెంట చైనా దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ చేపడుతున్న ఈ బ్రిడ్జి నిర్మాణం గతంలో నిర్మించిన బ్రిడ్జికి సమాంతరంగా జరుగుతోంది. ఇందుకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయి. భారీ మిలిటరీ వాహనాలు, యుద్ధ ట్యాంకుల రవాణాకు వీలుగా రెండో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి బ్రిడ్జి ప్రాంతంలో మూడు మొబైల్ టవర్స్‌ను కూడా చైనా ఏర్పాటు చేసింది. ఈ రెండు బ్రిడ్జిలు తూర్పు లడఖ్‌కు సమీపంలో ఉన్నాయి. పాంగాంగ్ సరస్సు పరిసరాల్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా చైనా అక్రమణ నిర్మాణాలకు పూనుకున్నట్లు అర్ధమవుతోంది. అయితే.. చైనా తీరును భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది.
పరిస్థితిని భారత ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. 60 ఏండ్ల క్రితం దురాక్రమణ చేసుకున్న ప్రాంతంలో చైనా బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోందని వివరించారు. దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని.. చైనా చేపట్టిన దురాక్రమ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు అరిందమ్.