భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…చైనా యుద్ధ విమానాల్లో ఒకటి వాస్తవాధీన రేఖ వెంబడి అతి సమీపానికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం తమ బలగాలను అప్రమత్తం చేయడంతో ఆ విమానం వెనక్కి వెళ్లిపోయిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
సరిహద్దు ప్రాంతంలో మోహరించిన వైమానిక దళ రాడార్ ద్వారా చైనా విమానాన్ని గుర్తించినట్లు ఆ అధికారి వివరించారు. కొంతకాలంగా కిమ్మనకుండా ఉన్న డ్రాగన్ మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు వెంట నిబంధనలను అతిక్రమిస్తోంది. తూర్పు లఢక్ సెక్టార్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గగనతల సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
తూర్పు లడఖ్‌కు సమీపంలో చైనా వైమానిక దళం నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో భారీ కసరత్తు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన వివరించారు.ఈ విషయంపై చైనాకు భారత ప్రభుత్వం హెచ్చరికలు చేసిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ అధికారి వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించారని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చైనాకు సూచించినట్లు తెలిపారు.
2020లోనూ ఒకసారి చైనా సైన్యం ఇలాగే వరుస కవ్వింపు చర్యలు చేసింది. దాని ఫలితమే గాల్వాన్‌లో ఘర్షణలు. 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా వైపు రెట్టింపు నష్టం జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు.