చైనాలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. దేశ రాజధాని బీజింగ్ తో పాటు ఆర్థిక రాజధాని షాంఘైలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. శ్మశానాల్లో లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో కరోనా మందుల కోసం చైనా ప్రజలు భారత్ వైపు చూస్తున్నారు. భారత్ తయారు చేసిన యాంటీ కొవిడ్ జెనరిక్ మందులను చైనీయులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. భారత్‌కు చెందిన నాలుగు రకాల జెనరిక్ యాంటీ కొవిడ్ మందులను డ్రాగన్ కంట్రీలో చట్టవిరుద్దంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ లాంటి బ్రాండ్ల జెనరిక్ కొవిడ్ మందుల బాక్స్‌లను వేయి యువాన్లు చెల్లించి బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు.ఈ విషయం చైనా సోషల్ మీడియా వీబోలో తెగ వైరల్ అవుతోంది. భారతీయ యాంటీ కరోనా మందులను చైనా ప్రభుత్వం అనుమతించలేదు.
దీంతో ఆయా మందులను అక్రమంగా కొనుగోలు చేయడం నేరంగా పరిగణించనున్నారు. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్న ప్రజలు ప్రభుత్వ ఆంక్షలను ఏ మాత్రమూ లెక్క చేయడం లేదని తెలుస్తోంది. చౌకగా లభిస్తున్న భారతీయ యాంటీ కరోనా మందులను అక్రమ పద్ధతుల్లో, బ్లాక్ మార్కెట్‌లో వారు కోనుగోలు చేస్తున్నారు.
కరోనా మందులను అక్రమ పద్ధతుల్లో కొనుగోలు చేయవద్దంటూ చైనా ప్రజలను ఆ దేశ వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా కేసులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. దీంతో జ్వరానికి వినియోగించే పారాసిటమాల్, ఐబూప్రొఫెన్ వంటి ఆమోదిత భారతీయ మందులకు ఆ దేశంలో భారీగా డిమాండ్ పెరుగుతోంది.
ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) చైర్మన్ సాహిల్ ముంజాల్ గత వారం రాయిటర్స్‌కు ఈ విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలో జర్వానికి సంబంధించిన మందుల ఉత్పత్తి, చైనాకు ఎగుమతులను భారతీయ ఔషధ కంపెనీలు వేగవంతం చేస్తున్నాయని చెప్పారు.