హవాలా కుంభకోణం చేస్తున్న పది మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక చైనీయుడితో పాటు తైవాన్ వ్యక్తి, మరి కొందరు ఇతర వ్యక్తులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు వివిధ బ్యాంకు ఖాతాల్లోని రూ.1.91 కోట్లు సీజ్ చేశారు.
అరెస్టైన వారిలో షాహిల్ బజాజ్, సన్నీ అలియాస్ పంకజ్, వీరేంద్ర సింగ్, సంజయ్ యాదవ్, నవనీత్ కౌశిక్, మహ్మద్ పర్వేజ్ (హైదరాబాద్), సయ్యద్ సుల్తాన్ ( హైదరాబాద్), 8. మీర్జా నదీమ్ బేగ్, (హైదరాబాద్) 9. లీజాంగ్ జున్ (చైనా), చుచున్ యూ తైవాన్ లు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
భారీ పెట్టుబడుల మోసంపై సైబర్ క్రైమ్ పోలీసులకు తార్నాకకు చెందిన వ్యక్తి ఒకరు ఫిర్యాదు చేశారు. లోక్జామ్ అనే యాప్‌లో రూ. 1.6 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్టు ఫిర్యాదులో సదరు వ్యక్తి పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఫిర్యాదుదారుడి నుంచి డబ్బును తీసుకుని జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాలోకి నిందితులు జమ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరేందర్ సింగ్ జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
దీంతో వీరేందర్ సింగ్‌ను పోలీసులు పూణేలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. జాక్ సూచనల మేరకే జిందాయ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బ్యాంకు ఖాతా తెరిచినట్లు వీరేందర్ సింగ్ వెల్లడించాడు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ పాస్ వర్డ్ లను కూడా జాక్ కు ఇచ్చినట్టు వీరేందర్ సింగ్ వెల్లడించాడు.
మొత్తం ఎనిమిది మంది భారతీయులు తమ బ్యాంకు ఖాతాలను అందించడంతో విదేశాలకు నగదు బదిలీ చేశారని, దీంతో ఈ స్కామ్ చాలా సులభంగా జరిగిందని సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. భారతీయ, విదేశీ ఖాతాల నెట్‌వర్క్ ద్వారా అనుమానాస్పద పెట్టుబడిదారులు తమ డబ్బును వైట్ చేయడానికి చేస్తున్న మోసంగా ఆయన అభిప్రాయపడ్డారు.