సౌత్ చైనా సీ పై గస్తీ తిరుగుతున్న అమెరికా విమానాన్ని క్షిపణి వ్యవస్థలతో కూడిన చైనా ఫైటర్ జెట్ అడ్డగించింది. ఆ విమానాన్ని సుమారు 15 నిముషాలపాటు వెంబడించి వెనుదిరిగింది. దక్షిణ చైనా సముద్రం పై పరాసెల్ దీవుల సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనపై పెంటగాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీ-8 పోసిడియాన్ గా వ్యవహరిస్తున్న తమ గస్తీ విమానం ఈ సముద్రంపై 21,500 అడుగుల ఎత్తున ఎగురుతుండగా .. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించగల మిసైల్స్ తో కూడిన చైనీస్ జెట్ విమానం అడ్డగించిందని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.
15 నిముషాల పాటు వెంబడించి తిరిగి వెనక్కి మళ్లినట్టు పేర్కొంది. అయితే తమ జెట్ ఫైటర్ మీ విమానానికి 12 నాటికల్ మైళ్ళ దూరంలో ఉందని, దానికి సమీపంగా వెళ్లలేదని, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి అమెరికన్ విమానానికి ఓ మెసేజ్ అందింది. జరిగిన దానికి మీదే బాధ్యత తప్ప మాది కాదని దాదాపు హెచ్చరించింది.
సౌత్ చైనా సీ పై తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంది. ఇతర దేశాలేవీ తమ సైనిక కార్యకలాపాలను ఇక్కడ నిర్వహించడానికి వీల్లేదని బెదిరిస్తోంది. ప్రతి ఏడాదీ చైనా ఈ ప్రాంతంలో సుమారు 5 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఈ ప్రాంతానికి చేరుస్తోంది.
వీటిలో ఆయుధ పరికరాలు కూడా ఉన్నాయి. మా దేశంపై గూఢచర్యం జరిపేందుకు అమెరికా తన గస్తీ విమానాలను వినియోగిస్తోందని చైనా ఆరోపిస్తోంది. పైగా సౌత్ చైనా సీ వద్ద ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు చర్చలకు రావాలన్న అమెరికా సూచనను కూడా డ్రాగన్ కంట్రీ నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ ఈ దేశం కృత్రిమ దీవులను, మిలిటరీ స్థావరాలను నిర్మించింది.